బాబు కేబినెట్ 21+3+1 లెక్క ప‌క్కా!!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నేతృత్వంలోని కూటమి స‌ర్కారు కొలువులో కీల‌క ప‌ద‌వులు పంచేశారు. లెక్క‌ను ప‌క్కాగానే తేల్చేశారు. మొత్తం 175 మంత్రి ఎమ్మెల్యేలు ఉన్న అసెంబ్లీలో ఏడుగురు ఎమ్మెల్యేల‌కు ఒక్క‌రు చొప్పున మంత్రుల‌ను కేటాయించారు. దీని ప్ర‌కారం 134 మంది ఎమ్మెల్యేలు ఉన్న టీడీపీకి 21 మంత్రి ప‌ద‌వులు ద‌క్కాయి. ఇక‌, 21 మంది ఎమ్మెల్యేలు ఉన్న జ‌న‌సేన‌కు మూడు ప‌ద‌వులు చిక్కాయి. అదేస‌మ‌యంలో ప‌ది స్థానాల్లో పోటీ చేసిన ఎనిమిది మందిని గెలిపించుకున్న బీజేపీకి ఒక ప‌ద‌వి ద‌క్కింది.

మొత్తంగా చంద్ర‌బాబుతో క‌లిపి 21+3+1 ఫార్ములాలో చంద్ర‌బాబు కేబినెట్ కొలుదీరుతోంది. దీనిలోనూ కులా లు సామాజిక వ‌ర్గాల వారిగా చూసుకుంటే.. దాదాపు అన్ని సామాజిక వ‌ర్గాల‌కు న్యాయం జ‌రిగింది. కాపులు, వైశ్య‌, రెడ్డి సామాజిక వ‌ర్గాల‌కు ప్రాధాన్యం ద‌క్కింది. అలానే గ‌తానికి భిన్నంగా ఎస్టీ సామాజిక వ‌ర్గానికి కూడా ఈ ద‌ఫా ప్రాధాన్యం ద‌క్క‌డం గ‌మ‌నార్హం. అయితే.. మొత్తంగా బీసీల‌కు ఈసారి కూడా పెద్ద పీట వేశారు. బీసీ సామాజిక వ‌ర్గాల‌కు చెందిన వారికి 8 మందికి ప‌ద‌వులు ద‌క్కాయి.

అలానే తొలిసారి కుర‌బ సామాజిక వ‌ర్గానికి చంద్ర‌బాబు ప్రాధాన్యం ఇచ్చారు. ఎస్సీల్లో రెండు సామాజిక వ‌ర్గాల‌కు కూడా అవ‌కాశం ఇచ్చారు. మాల‌, మాదిగ వ‌ర్గాల‌కు రెండింటికీ కూడా చంద్ర‌బాబు పెద్ద‌పీట వేశారు. రెడ్డి సామాజిక వ‌ర్గంలో ముగ్గురికి అవ‌కాశం క‌ల్పించారు. ముగ్గురూ కూడా టీడీపీకి చెందిన వారే కావ‌డం గ‌మ‌నార్హం. కాపు కోటాలో మాత్రం రెండు జ‌న‌సేన‌కు, ఒక‌టి మాత్ర‌మే టీడీపీకి కేటాయించారు. అందునా కీల‌క నాయ‌కుడికే అవకాశం ఇచ్చారు. మొత్తంగా చంద్ర‌బాబు కేబినెట్ లెక్క ప‌క్కాగా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.