ఏ పథకం తీసుకున్నప్పటికీ.. ఏ కార్యక్రమం తీసుకున్నప్పటికీ.. తన పేరు ఉండాల్సిందే.. కుదిరినా కుదరకపోయినా.. తన ఫొటో వేయాల్సిందే. ఇదీ.. గతంలో వైసీపీ అధినేత, సీఎం జగన్ చేసిన తీర్మానం.. ఆదేశించిన తీరు. దీంతో చేసేదేముంది.. అధికారులు కూడాఅయ్యగారి బాటనే పట్టారు. దీంతో అన్నింటి పైనా జగన్ ఫొటోలు.. పేర్లు ముద్రించేశారు. అయితే.. ఈ సమయంలో జగన్ ఏమనుకున్నారో తెలియదు కానీ.. ప్రజలు దీనిని ఏవగించుకున్నారనే టాక్ ఎన్నికల అనంతరం వినిపించింది.
ఒకటి కాదు.. రెండు కాదు అన్ని కీలక పథకాలపైనా జగన్ తన పేరును ముద్రించుకున్నారు. సర్వేలకు వినియోగించే హద్దు రాళ్లపై ఏకంగా తన ఫొటోలనే కార్వింగ్(చెక్కించుకోవడం) చేయించుకున్నారు. ఇక, ప్రజలకు ఇచ్చే ప్రతి పథకంపైనా తన పేరు వేసుకున్నారు. చివరకు చిన్నారులకు ఇచ్చే స్కూలు బ్యాగులు.. పుస్తకాలు..వారు తినే ఆహారంపైనా పేరు , ఫొటో వేసుకున్నారు. ఇవన్నీ శాశ్వత మని జగన్ అనుకుని ఉండొచ్చు.
కానీ.. ప్రజాస్వామ్యంలో అధికారం నీటి బుడగ. దీనిని గుర్తించే సరికి.. జగన్ పేరు పోయింది. అన్ని పథకాల నుంచి జగన్ పేరును తొలగించేందుకు చర్యలు చేపట్టారు. తాజాగా ప్రభుత్వ స్కూల్ పిల్లలకు మధ్యాహ్న భోజనంలో ఇచ్చే చిక్కీల కవర్ల రంగు మార్చారు. అంతేకాదు.. జగన్ ఫొటోలను కూడా తీసేశారు. ఇప్పటి వరకు వైసీపీ రంగులతో పాటు జగన్ బొమ్మను ముద్రించగా ప్రస్తుతం ప్రభుత్వ రాజముద్రతో చిక్కీల కవర్లను రూపొందించారు.
అలాగే వాటిపై ‘జగనన్న గోరుముద్ద’ అని ఉండగా దాన్ని తొలగించారు. రేపటి నుంచి పాఠశాలలు పున: ప్రారంభం కావాల్సి ఉండటంతో విద్యార్థులకు చిక్కీలతో పాటు కోడిగుడ్లు, రాగిపిండి సరఫరా చేయనున్నారు. నిజానికి చిక్కీ ప్యాకెట్లు రెండు అంగుళాల వెడల్పు మాత్రమే ఉంటాయి. వాటిపైనా జగన్ తన ఫొటోలు వేయించుకున్నారు. ఇప్పుడు సర్కారు పోయే సరికి.. రంగుతో పాటు ఆయన ఫొటో కూడా పోయింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates