ఏపీలో రియ‌ల్ బూమ్‌.. బాబు ప్ర‌మాణం చేయ‌కుండానే..!

నిన్న మొన్న‌టి వ‌ర‌కు గ‌జం రూ.3500 ఉండ‌గా.. ఇప్పుడు ఏకంగా 45000ల రూపాయ‌ల‌కు చేరిపోయింది. ఒక‌వైపు ప్ర‌భుత్వం పూర్తిగా అధికారంలోకి రాక‌ముందే.. అమ‌రావ‌తి ప్రాంతంలో బాగుచేత‌లు ప్రారంభించారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో తుప్పు ప‌ట్టిపోయిన ప‌రిక‌రాలు.. దుమ్ము ప‌ట్ట‌డాల‌ను బాగు చేస్తున్నారు. ఇదేస‌మ‌యంలో తుమ్మ చెట్లు కొట్టేస్తూ.. ర‌హ‌దారుల‌ను కూడా నిర్మిస్తున్నారు. దీంతో రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారులు మ‌రోసారి కార్య‌క‌లాపాలు ప్రారంభించారు.

ఇక‌, స‌మీపంలోని గుంటూరు, విజ‌య‌వాడ న‌గ‌రాల్లోనూ రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారాలు పుంజుకున్నాయి. ఈ నెల 1వ తేదీ వ‌ర‌కు డ‌బుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు 40-45 ల‌క్ష‌ల మ‌ధ్య ఉండ‌గా.. ఇప్పుడు 50 ల‌క్ష‌ల పైమాటే ప‌లుకుతున్నాయి. ఇక‌, నిర్మాణంలో ఉన్న వాటిని హాట్ కేకుల్లా అమ్మేస్తున్నారు. ఎటు చూసినా.. రియ‌ల్ ఎస్టేట్ సంద‌ళ్లు.. కార్మికుల గ‌ల‌గ‌ల‌లు వినిపిస్తున్నాయి. అన్ని ర‌కాల ప‌నివారు కూడా.. ఇప్పుడు బిజీ అయిపోయారు.

బుధ‌వారం చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన త‌ర్వాత‌.. తీసుకునే నిర్ణ‌యాల‌తో రియ‌ల్ బూమ్ మ‌రింత పెరుగుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ముఖ్యంగా తొలి వారంలోనే ఇసుక విధానంపై స‌మీక్షించ‌నున్నారు. దీంతో ఈ హ‌డావుడి మ‌రింత పెరుగుతుంద‌ని భావిస్తున్నారు. అలానే కొనుగోలు దారులు కూడా.. గ‌తంలో హైద‌రాబాద్ వైపు చూడ‌గా ఇప్పుడు విజ‌య‌వాడ‌, గుంటూరు ప‌రిస‌రాల్లోనేకొనుగోలు చేస్తున్నారు. ఎలా చూసుకున్నా రియ‌ల్ బూమ్ ఊహించ‌ని విధంగా జోరు అందుకోవ‌డం గ‌మ‌నార్హం.