2024 ఎన్నికలకు ముందు మాజీ ఎంపీ కేశినేని నాని టీడీపీని వీడి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే, రెండు సార్లు టీడీపీ టికెట్ మీద ఎంపీగా గెలిచిన నాని..ఈసారి వైసీపీ టికెట్ మీద ఓడిపోయారు. సొంత తమ్ముడు చిన్ని చేతిలో భారీ మెజారిటీతో నాని పరాభవం పాలయ్యారు. ఈ క్రమంలోనే నాని రాజకీయ భవిష్యత్ ఏమిటి అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలోనే తన పొలిటికల్ కెరీర్ పై నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు కేశినేని నాని ప్రకటించారు. ఈ రోజుతో తన రాజకీయ ప్రస్థానం ముగిసిందని సంచలన ప్రకటన చేశారు.
ఎన్నో అంశాలను, పలు వైపుల నుంచి వచ్చిన ప్రతిస్పందనలను గమనించిన తర్వాతే రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నానని చెప్పారు. రెండుసార్లు విజయవాడ ఎంపీగా ప్రజలకు సేవ చేయడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని కేశినేని నాని అన్నారు. విజయవాడ ప్రజల స్థైర్యం, వారి దృఢసంకల్పం తనకు స్ఫూర్తినిస్తాయని, వారి అచంచలమైన మద్దతుకు తాను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని చెప్పారు.
తాను ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా విజయవాడపై తన అంకితభావం బలంగానే ఉంటుందని, విజయవాడ అభివృద్ధికి తాను చేయగలిగినంత సాయం చేస్తూనే ఉంటానని చెప్పారు. తన జీవితంలో కొత్త అధ్యాయం మొదలు కాబోతోందని, ఎంతో విలువైన జ్ఞాపకాలను, అమూల్యమైన అనుభవాలను తనతో తీసుకువెళుతున్నానని అన్నారు. విజయవాడ అభివృద్ధి కోసం పరితపించే కొత్త ప్రజాప్రతినిధులకు నాని శుభాకాంక్షలు తెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates