నమో @ 72

చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. మూడవ సారి ప్రధానిగా నరేంద్రమోదీ ప్రమాణం చేసి దివంగత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ రికార్డును సమం చేశారు. హ్యాట్రిక్ విజయాలతో ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకువచ్చిన మోదీ.. ముచ్చటగా 3వ సారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. తరలి వచ్చిన విదేశీ అతిథులు, వీవీఐపీలు, సెలబ్రిటీలు, వేలాది మంది ప్రజల సమక్షంలో రాష్ట్రపతిభవన్‌లో కన్నులపండువగా ఈ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలుత నరేంద్ర మోదీతో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రధాని మోదీ ప్రమాణం అనంతరం ద్రౌపది ముర్ము కేబినెట్ మంత్రులు, సహాయ మంత్రులతో ప్రమాణస్వీకారం చేయిస్తున్నారు.. ప్రధాని ప్రమాణం తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్‌నాథ్‌సింగ్‌, అమిత్‌షా తో ప్రమాణం చేయించారు.

ఈసారి మోదీ కేబినెట్‌లో 72 మంది మంత్రులు ఉన్నారు. వీరిలో కేబినెట్ ర్యాంక్‌ 30 మందికి, సహాయ మంత్రులు (స్వతంత్ర హోదా) ఐదుగురుకి, సహాయ మంత్రులుగా 36 మంది ప్రమాణం చేశారు. మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన వారిలో 43 మందికి 3 సార్లు కేంద్ర మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది.. 39 మందికి రాష్ట్రాల్లో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది. 24 రాష్ట్రాలకు మోడీ మంత్రివర్గంలో ప్రాతినిధ్యం దక్కింది. మిత్రపక్షాలకు 11 కేంద్ర మంత్రి పదవులు దక్కాయి. మిత్రపక్షాల్లో జనసేనకు అవకాశం దక్కలేదు.

నలుగురు ముఖ్యమంత్రులు ఈసారి కేంద్ర కేబినెట్‌లో ఉన్నారు. గతంలో మధ్యప్రదేశ్ సీఎంగా చేసిన శివరాజ్‌ సింగ్ చౌహాన్‌, హర్యానా మాజీ సీఎ మనోహర్‌లాల్‌ ఖట్టర్‌, కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి, బీహార్‌ మాజీ సీఎం జితిన్‌ రామ్ మాంఝీ ఇప్పుడు కేంద్రంలో మంత్రులుగా ఉన్నారు. కేబినెట్‌ మంత్రుల్లో అగ్రవర్ణాలకు చెందిన వారు 25మంది, ఓబీసీలు 27, ఎస్సీ 10, ఎస్టీ 5, మైనార్టీలు 5 మంది కేబినెట్ మంత్రులుగా ఉన్నారు.