బొమ్మరిల్లు సినిమా చూపిస్తున్న వైసీపీ నేతలు

టాలీవుడ్ లో బొమ్మరిల్లు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తనకు ఏ మాత్రం ఇష్టం లేకపోయినా తండ్రి చెప్పింది చెప్పినట్లు చేసే కొడుకు…పాతికేళ్లు వచ్చినా తన కొడుక్కి..ఆ మాటకొస్తే తన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ఏం తెలీదు..తాను చెప్పింది..చేసేదే కరెక్ట్….అని భావించే తండ్రి…చివరకు ఓ దశలో బరస్ట్ అయ్యి..అంతా మీరే చేశారు అంటూ తండ్రిపై తన ఇన్నర్ ఫీలింగ్ ని ఆయన ముందే వెళ్లగక్కే కొడుకు…ఇలా తండ్రిని గెలిపించేందుకు పాతికేళ్లుగా ఓడిపోతున్నా అని చెప్పే కొడుకు పాత్రలో సిద్ధార్థ్…తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ అద్భుతంగా నటించారు.

కట్ చేస్తే ఇపుడు ఏపీలో సరిగ్గా వైసీపీ అధినేత జగన్, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు, వైసీపీ కీలక నేతల మధ్య బొమ్మరిల్లు సీన్ కనిపిస్తోంది. ఎన్నికల ముందు వరకు సైలెంట్ గా ఉన్న సదరు వైసీపీ నేతలు…ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత మాత్రం జగన్ పై తమ మనసులో ఉన్న అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పేస్తున్నారు.

జగన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలతో తాము విభేదించామని, వద్దని వారించినా జగన్ వినకపోవడంతోనే పార్టీ, తాము ఇంత ఘోర పరాభవం మూటగట్టుకున్నామని అంటున్నారు. అంతా జగన్, ఐ ప్యాక్ చేశారని…వారిని గెలిపించడానికి నోరు మూసుకోవంతో తాము ఓడిపోయామని చెబుతున్నారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా ఉండి…ఇపుడు ఒక్కొక్కరిగా తమ అభిప్రాయాలు పంచుకుంటున్న వైసీపీ నేతల వ్యవహారం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.

ఏపీలో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు కంచుకోట‌ల వంటి నియోజ‌క‌వ‌ర్గాల‌ను కూడా..వైసీపీ కోల్పోయింది. అంతేకాదు.. ఓట‌మి ఎరుగ‌ని నాయకులు కూడా.. ఈ సారి ఓడిపోయారు.

క‌నీసం ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం హోదా కూడా ద‌క్కించుకునే ప‌రిస్థితి లేకుండా పోయిం ది. వైసీపీ సీనియ‌ర్ల‌ను క‌ల‌చి వేస్తున్నారు. ఈ నెల 4న ఫ‌లితాలు వ‌చ్చిన త‌ర్వాత‌.. ముందు సీఎంవో అధికారులపై కొంద‌రు విమ‌ర్శ‌లు చేసినా.. ఇప్పుడు కీల‌క నేత‌లు బ‌రిలోకి వ‌చ్చారు.

అస‌లు విష‌యాలు చెబుతున్నారు. దేవ‌దాయ శాఖ‌ మాజీ మంత్రి కొట్టు స‌త్య‌నారాయ‌ణ తాజాగా త‌న అనుచ‌ర‌గ‌ణంతో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న జ‌గ‌న్‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

ప్ర‌జ‌ల్లో గెలిచిన వారిని ఆయ‌న ప‌ట్టించుకోలేదు. ప్ర‌జాప్ర‌తినిధుల‌కు వాల్యూ ఇవ్వ‌లేదు. క‌నీసం కేడ‌ర్ బాగోగులు కూడా ప‌ట్టించుకోలేదు. ఎక్క‌డో ఐఐటీ ఖ‌ర‌గ్ పూర్‌, ఐఐటీ మ‌ద్రాస్ నుంచి వ‌చ్చారంటూ.. ద‌రిద్ర గొట్టు ఐప్యాక్ ను న‌మ్ముకున్నారు. మ‌మ్మ‌ల్ని ఐప్యాక్ నిండా ముంచేసింది అని కొట్టు వ్యాఖ్యానించారు.

అంతేకాదు.. ఎక్క‌డా లేని నిరుద్యోగులు అందరూ.. సీఎంవోను ఆక్ర‌మించేశార‌ని చెప్పారు. ప్ర‌జ‌ల్లో రూపా యికి ప‌నికిరాని వారి మాట‌లు విన్నారే త‌ప్ప‌.. ప్ర‌జ‌ల నుంచి గెలిచిన వారిని ఏనాడైనా ప‌ట్టించుకున్నారా? అని ప్ర‌శ్నించారు.

ఇక‌, పాణ్యం మాజీ ఎమ్మెల్యే.. ఓట‌మి అన్న‌ది తెలియ‌ని కాట‌సాని రాంభూపాల్ రెడ్డి మ‌రింత రెచ్చిపోయారు. జ‌గ‌న్ మొండి త‌న‌మే త‌మ‌కు శాపంగా మారింద‌ని చెప్పారు. ఎన్నిక‌ల‌కు ముందు ల్యాండ్ టైటిలింగ్ చ‌ట్టం తీసుకురావ‌ద్ద‌ని.. తాము ప‌దే ప‌దే చెప్పామ‌ని అన్నారు.

అయినా.. త‌మ మాట‌ను ముఖ్య‌మంత్రిగా ఉన్న జ‌గ‌న్ కానీ.. స‌ల‌హాదారులు కానీ.. ప‌ట్టించుకోలేద‌న్నారు. “నా నియోజ‌క‌వ‌ర్గంలో నాకు అనుకూలంగా ఉన్న గ్రామాల్లో కూడా.. ఓటు రాలేదు. నేను పోయి అడిగిన‌.. ఏ అమ్మా ఎవ‌రికి ఓటేశార‌ని! జ‌గ‌న్‌కు ఓటేస్తే.. మా భూములు లాగేసుకుంటారు.. అందుకే వేయ‌లేదు.. అని చెప్పారు.

ఇదే విష‌యాన్ని మేం ఎన్నిక‌ల‌కు మందు నెత్తీ నోరూ మొత్తుకుని జ‌గ‌న్ చెప్పాం. ఇప్పుడు వ‌ద్దు నాయ‌నా.. త‌ర్వాత‌.. చూసుకుందువులే.. అంటే మామాట విన‌లేదు. అంద‌ర‌నీ ముంచేశాడు“ అని నిప్పులు చెరిగారు.