మోదీ అనే నేను…హ్యాట్రిక్ ప్రమాణ స్వీకారం

కేంద్రంలో ఎన్డీఏ కూటమి మూడో సారి వరుసగా అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ రోజు భారత ప్రధానిగా నరేంద్ర దామోదర్ దాస్ మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ లో మోదీతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. భగవంతుడి సాక్షిగా తాను భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నానని, ఎటువంటి రాగద్వేషాలకు, పక్షపాతానికి లోను కాకుండా అంత:కరణ శుద్ధితో తన బాధ్యతలు నిర్వహిస్తానని మోదీ హిందీలో ప్రమాణం చేశారు. మోదీతో పాటు రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, శివ రాజ్ సింగ్ చౌహాన్ ప్రమాణ స్వీకారం చేశారు. వీరితోకలిపి మొత్తం 68 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా మోదీ రికార్డు క్రియేట్ చేశారు. మోదీ మంత్రివర్గంలో ఏపీ నుంచి టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్ర శేఖర్, బీజేపీ ఎంపీ శ్రీనివాస వర్మలకు చోటు దక్కగా..తెలంగాణ నుంచి బీజేపీ ఎంపీలు బండి సంజయ్, కిషన్ రెడ్డిలకు చోటు దక్కింది.

ఈ కార్యక్రమానికి పలు దేశాల అధినేతలు, భారత్ లోని పలు పార్టీల అధినేతలు హాజరయ్యారు. ఏపీ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరయ్యారు. భూటాన్ పీఎం షేరింగ్ తోబ్‌గే, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, మాల్దీవ్స్ ప్రెసిడెంట్ మొహమ్మద్ మొయిజ్జు, శ్రీలంక అధ్యక్షుడు విక్రమ్ సింఘే, బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్, మణిపూర్ సీఎం బీరేన్ సింగ్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ ధామీ, మండి ఎంపీ కంగనా రనౌత్, బీహార్ సీఎం నితీశ్ కుమార్, సూపర్ స్టార్ రజనీకాంత్, సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.