వైసీపీ అధినేత జగన్‌కు ఇంటా బయటా కూడా.. సెగతగులుతోంది. తాజా ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురు కావడంతో ఆయ నపై సొంత పార్టీ నాయకులు నిప్పులు చెరుగుతున్నారు.
ఈ ఎన్నికల్లో గెలుపు ఖాయమని చెప్పిన జగన్ కారణంగా.. తాము రూ.కోట్ల మేరకు అప్పులు చేసి మరీ ఖర్చు చేశామని.. కానీ, ఇప్పుడు నిండా మునిగిపోయామని పలు జిల్లాల్లో నాయకులు తలలు పట్టుకుంటున్నారు.
మరికొందరు.. కొంత సొమ్మయినా.. తమకు ఇచ్చి ఆదుకోవాలని తాడేపల్లికి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఇదిలావుంటే.. వైసీపీ గెలుస్తుందన్న నమ్మకంతో కొందరు భారీగా బెట్టింగులు కట్టి పూర్తిగా మునిగిపోయారు.
ఈ పరిణామాలతో పాటు కొన్ని జిల్లాల్లో చోటు చేసుకున్న ఘర్షణల కారణంగా నాయకులు పరారయ్యారు. దీంతో వైసీపీ పరిస్థితి దారుణంగా మారిపోయింది. ఒకవైపు ఈ వేడిని.. నాయకులు ఆగ్రహాన్ని గమనించిన జగన్.. తప్పు తనదికాదనే వాదనను తెరమీదికి తెస్తున్నారు. అంతా సీఎంవో అధికారులదేనని చెప్పించే ప్రయత్నంలో ఉన్నారు.
ఇప్పటికే ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిలు.. సీఎంవో అదికారులపై నిప్పులు చెరిగారు. కానీ.. ఈ విషయాన్ని సొంత పార్టీ నాయకులు నమ్మడం లేదు. నమ్మి ఉంటే.. వారికి అనుగుణంగానే రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన నాయకులు కూడా గళం వినిపించేవారు.
ఈ నేపథ్యంలో వైసిపి అధినేత జగన్‌ని మాత్రమే నమ్ముకుని ఇప్పుడు మునిగిపోయామంటూ పార్టీ కీలక నాయకులు అంతర్గత చర్చల్లో గగ్గోలు పెడుతున్నాయి. నిజానికి పోలింగ్ శాతం బాగా పెరగడంతో అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటింగ్ జరిగిందని ఎక్కువ మంది విశ్లేషించారు.
వైసీపీకి ఓటమి ఖాయమన్న ప్రచారం జరగడంతో సీఎం జగన్ రెండు రోజుల తర్వాత ఐ ప్యాక్ ఆఫీసుకు వెళ్లి.. దేశం మొత్తం తిరిగి చూసే విజయాన్ని సాధిస్తామని చెప్పుకొచ్చారు. దీంతో నాయకులు కొంత మేరకు ఊరట చెందినా.. తీరా ఫలితం వచ్చాక కథ రివర్స్ అయిపోయింది. దీంతో నాయకులు పెద్ద సంఖ్యలో జగన్‌పై విరుచుకుపడుతు న్నారు.
మరోవైపు వైసీపీ గెలుపుపై నమ్మకంతో బెట్టింగులు కాసిన వారు కూడా.. భారీగా నష్టపోయారు. వీరు కూడా ఇప్పుడు వైసీపీ అంటేనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చివరికి పార్టీ ఓటమితో పాటు పందేలు కూడా కోల్పోవడంతో తీవ్రంగా నష్టపోయామని.. ఈ సొమ్ములో సగమైనా ఇచ్చి తమను ఆదుకోవాలని వారు డిమాండ్లు చేస్తున్నారు.
మొత్తంగా జగన్ చుట్టూ అనేక మంది తిట్ల వర్షం కురిపిస్తున్నారు. వీరిలో కొందరు సంయమనం పాటిస్తున్నారు. మరికొందరు మాత్రం అంతర్గత చర్చల్లో జగన్ వైఖరిని తీవ్రస్థాయిలో తప్పుబడుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని గమనించకుండా.. ప్రచారానికి రెడీ అయి తమను నిండా ముంచారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.