కష్టానికి ఫలితం దక్కింది. తెలంగాణలో బీజేపీ దూకుడుకు.. ఆ పార్టీ విస్తరణకు కూడా… పెద్ద ఎత్తున కృషి చేసిన బండి సంజయ్‌కు కేంద్ర మంత్రి పదవి దక్కింది. అలుపెరుగని పోరాటం చేస్తూ.. కేసీఆర్ గత సర్కారుపై నిప్పులు చెరగడంలో సంజయ్ కీలక పాత్ర పోషించారు.
దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో నూ.. సాగర్ ఉప ఎన్నికల సమయంలోనూ.. కీలక రోల్‌తో ఆయన దూకుడు ప్రదర్శించారు. అదేవిధంగా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర చేశారు.
2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా.. తాజాగా జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం విజయం దక్కించుకున్నారు. దీంతో ఈయనకు కేంద్రంలో మంత్రి పదవి దక్కింది. ఇప్పటికే ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం రావడంతో అక్కడే ఉన్న బండి ప్రధాని కార్యాలయానికి వెళ్లారు. మరోవైపు.. రాష్ట్ర బీజేపీ చీఫ్ గంగాపురం కిషన్ రెడ్డికి కూడా.. మంత్రి పదవి దక్కింది. ఈయనకు కూడా.. కేంద్ర కేబినెట్ పదవే దక్కడం గమనార్హం.
వ్యూహం ప్రకారం చూస్తే.. 4 స్థానాలుగా ఉన్న తెలంగాణలో బీజేపీని 8 స్థానాలకు పరుగులు పెట్టించడం లోనూ.. రాష్ట్ర సర్కారుపై నిప్పులు చెరగడంలోనూ.. బండి కీలక పాత్ర పోషించారు.
పైగా మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందిన నాయకుడు కావడం కూడా కలిసి వచ్చింది. రెడ్ల కోటాలో కిషన్ రెడ్డికి అవకాశం వచ్చింది. రాష్ట్రంలో మున్ముందు పార్టీ బలోపేతం అయ్యేందుకు.. ఈ ప్రయోగం ఫలిస్తుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.