ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమితో కలిసి వైసీపీని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చావుదెబ్బ కొట్టారు. జగన్‌కు దారుణమైన పరాభవాన్ని అందించారు. ఇప్పుడు జగన్ సొంత జిల్లా కడపలోనూ ఆయన్ని కట్టడి చేసేందుకు బాబు మరిన్ని వ్యూహాలు రచిస్తున్నట్లు తెలిసింది.
కడపలో టీడీపీ బలాన్ని పెంచేలా.. వైసీపీని మరింత దెబ్బకొట్టేలా బాబు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని టాక్. ఇందులో భాగంగానే కడప అసెంబ్లీ స్థానం నుంచి గెలిచిన రెడ్డెప్పగారి మాధవీరెడ్డికి మంత్రి పదవి ఇవ్వబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. దీంతో ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మరోసారి బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఈ నేపథ్యంలో బాబు మంత్రివర్గం కూర్పుపై ఆసక్తి నెలకొంది.
బాబు మంత్రివర్గంలో మాధవీరెడ్డికి కచ్చితంగా పదవి లభిస్తుందనే అంచనాలు నెలకొన్నాయి. బలమైన రాజకీయ నేపథ్యమున్న కుటుంబం నుంచి రావడం, అలాగే ఆమె భర్త శ్రీనివాస్‌రెడ్డి చాలా కాలం నుంచి టీడీపీకి ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు.
బలమైన నేపథ్యం కారణంగా మాధవీరెడ్డి వైపు బాబు మొగ్గుచూపుతున్నారని తెలిసింది. కడపలో జగన్‌ను కట్టడి చేసేందుకు ఆమెకు మంత్రి పదవి ఇవ్వడమే సరైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కడపలో వైసీపీని చిత్తుచేసిన మాధవీరెడ్డికి టీడీపీలో ప్రత్యేక గౌరవం కలుగుతోంది.
దూకుడు స్వభావం కలిగిన ఆమెకు మంత్రి పదవి ఇస్తే కడపలో టీడీపీ బలోపేతానికి కృషి చేస్తారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు కూడా ఇదే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.