మాజీ సీఎంకు బ్యాడ్‌ల‌క్‌.. గెలిచి ఉంటే మంత్రి

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చివ‌రి ముఖ్య‌మంత్రి న‌ల్లారి కిర‌ణ్ కుమార్ రెడ్డిని దుర‌దృష్టం వెంటాడింది. అన్ని క‌లిసొస్తే ఆయ‌న మోడీ మంత్రివ‌ర్గంలో చోటు ద‌క్కించునేవార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కానీ బ్యాడ్‌ల‌క్ కార‌ణంగా లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఓట‌మితో కిర‌ణ్ కుమార్ రెడ్డికి మంచి అవ‌కాశం చేజారింద‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. వైసీపీపై ఇంత వ్య‌తిరేక‌త వ‌చ్చిన ఎన్నిక‌ల్లోనూ కిర‌ణ్ కుమార్ విజ‌యాన్ని అందుకోలేక‌పోయారు.

మాజీ సీఎం కిర‌ణ్ కుమార్ దాదాపు ప‌దేళ్ల పాటు ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత పెద్ద‌గా యాక్టివ్ కాలేదు. తిరిగి కాంగ్రెస్‌లోకి వెళ్లినా అక్క‌డ ఉండలేక‌పోయారు. ఆ త‌ర్వాత బీజేపీలో చేరి అదృష్టం ప‌రీక్షించుకోవాలనుకున్నారు. రాజంపేట లోక్‌స‌భ నియోజ‌వ‌క‌ర్గం నుంచి ఎంపీగా పోటీచేశారు. ఆ నియోజ‌క‌వ‌ర్గంపై కిర‌ణ్ కుమార్‌కు మంచి ప‌ట్టే ఉంది. అక్క‌డి పరిస్థితుల‌కు ఆయ‌న‌కు అల‌వాటే. ఇటు రెడ్డి సామాజిక వ‌ర్గంతో పాటు అటు కూట‌మిలోని టీడీపీ, జ‌న‌సేన ఓట్లు కూడా త‌న‌కే ప‌డ‌తాయ‌ని ఆశ‌లు పెట్టుకున్నారు.

త‌న రాజ‌కీయ శ‌త్రువు పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి త‌న‌యుడు మిథున్ రెడ్డిపై ఎలాగైనా గెల‌వాల‌నే సంక‌ల్పంతో కిర‌ణ్ కుమార్ సాగారు. కానీ అక్క‌డ క్రాస్ ఓటింగ్ జ‌రిగింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. టీడీపీ, జ‌న‌సేన ఓట్లు కిర‌ణ్ కుమార్‌కు ట్రాన్స్‌ఫ‌ర్ కాలేద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఇన్ని రోజులు ప్ర‌జ‌ల్లో లేని నాయ‌కుడికి ఎందుకు ఓటు వేయాల‌నే భావ‌న ప్ర‌జ‌ల్లో క‌నిపించింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఇదే కిర‌ణ్ కుమార్ ఓట‌మికి ప్ర‌ధాన కార‌ణంగా మారింది. ఏదైతేనేం ఆయ‌న ఓడిపోయారు. కానీ ఒక‌వేళ గెలిచి ఉంటే మాత్రం ఇప్పుడు మోడీ కేబినేట్‌లో చోటు ద‌క్కేద‌నే టాక్ మాత్రం బ‌లంగా వినిపిస్తోంది.