ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవంతో కుంగుతిన్న వైసీపీ అధినేత జగన్‌కు వరుసగా షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఆ ఓటమి నుంచి ఇంకా భయటపడని, దారుణ అవమానాన్ని ఇంకా జీర్ణించుకోలేని జగన్‌కు వైసీపీ నేతలు టెన్షన్ పెడుతున్నారు.
ఎన్నికల ఫలితాలతో పాతాళానికి పడిపోయిన పార్టీలో ఉండలేక గుడ్‌బై చెబుతున్నారు. టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో సీటు దక్కని నేతలు కూడా జగన్‌కు గుడ్‌బై చెప్పేందుకు రెడీ అవుతున్నారని తెలిసింది.
మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు వైసీపీకి గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. దళితుల సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతోందని ప్రకటించిన ఆయన.. తిరిగి టీడీపీలో చేరేందుకు ప్రయత్నించే అవకాశాలున్నాయి. 2014 ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా కిశోర్‌బాబు గెలిచారు.
బాబు ప్రభుత్వంలో మంత్రిగానూ పనిచేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి జనసేనలోకి మారి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం బీఆర్ఎస్‌లో చేరి ఏపీలో కొన్ని రోజుల పాటు ఆ పార్టీ వ్యవహారాలను చూశారు. కానీ 2024 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. ఇప్పుడు ఆ పార్టీ దారుణ పరాభవంతో గుడ్‌బై చెప్పేశారు.
మరోవైపు ఉమ్మడి వైఎస్సార్ జిల్లాకు చెందని వైసీపీ కీలక నాయకుడు, తాజా మాజీ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున్‌రెడ్డి కూడా పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారని తెలిసింది. రాజంపేట సిటింగ్ ఎమ్మెల్యే అయిన మల్లిఖార్జున్‌రెడ్డికి ఈ సారి జగన్ టికెట్ ఇవ్వలేదు. దీంతో మనస్థాపం చెందిన ఆయన ఎన్నికల ప్రచారంలో వైసీపీకి దూరంగా ఉన్నారు.
ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలుపుతో మల్లిఖార్జున్‌రెడ్డికి హుషారు వచ్చింది. తాజాగా చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌కు అభినందనలు తెలుపుతూ ఆయన రెండు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు. దీంతో మల్లిఖార్జున్ రెడ్డి తిరిగి టీడీపీ గూటికే చేరబోతున్నారని టాక్. 2014 ఎన్నికల్లో టీడీపీ తరపునే ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates