అమరావతిపై పవన్ లో ఇంత గందరగోళమా ?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ లో సేమ్ కన్ఫ్యూజన్ కంటిన్యు అవుతోంది. ఏ విషయంలో అయినా స్ధిరమైన అభిప్రాయాలు లేకపోవటమే మొదటినుండి పవన్ లో ఉన్న అతిపెద్ద లోపం. తాజాగా ’మూడు రాజధానులు నమ్మకద్రోహమే’ అనే హెడ్డింగ్ తో ప్రముఖ దినపత్రిక ఈనాడు పవన్ తో ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది.

అందులో తన అభిప్రాయాలు చెప్పిన పవన్ తనలోని అయోమయాన్ని మరోసారి బయటపెట్టారు. నిజానికి పవన్ ఇంటర్వ్యూని బ్యానర్ హెడ్డింగ్ గా ప్రచురించినా అందులో విషయమే లేదని అర్ధమైపోయింది. జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానులకు వ్యతిరేకంగా పవన్ తో మాట్లాడించినట్లు అర్ధమైపోతోంది.

ఇంటర్వ్యూలో ఒకచోట అమరావతిపై రాష్ట్రంలోని మిగిలిన చోట్ల స్పందన ఎలాగుంది అనే ప్రశ్నకు సమాధానమిస్తు అమరావతి నిర్మాణాన్ని చంద్రబాబు వాణిజ్యనమూనాగా చిత్రీకరించారని చెప్పారు. అందుకనే మిగిలిన ప్రాంతాల వారు అమరావతికి దూరమయ్యారని అభిప్రాయపడ్డారు. మళ్ళీ ఇదే ఇంటర్వ్యూలో అమరావతినే రాజధానిగా కంటిన్యు చేయాలని అన్నీ ప్రాంతాల ప్రజలు కోరుకుంటున్నట్లు చెప్పటమే విచిత్రంగా ఉంది. రాజధానిని మార్చుకునే అధికారం ప్రభుత్వానికి ఉందా ? అనే ప్రశ్నకు సంబంధం లేని సమాధానం చెప్పి తప్పించుకున్నారు.

ప్రతిపక్ష నేత హోదా అమరావతికి జగన్ అంగీకరించి ఇపుడు కాదని చెప్పటం అన్యాయమని పవన్ చెప్పటమే విచిత్రంగా ఉంది. అమరావతికి జగన్ మద్దతిచ్చిన మాట వాస్తవమే కానీ రైతుల నుండి భూమిని సమీకరించటాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ పవన్ ఆ మాట మాత్రం పట్టించుకోవటం లేదు. ప్రభుత్వ భూముల్లోనే రాజధానిని నిర్మించమని జగన్ చేసిన సూచనను చంద్రబాబునాయుడు, పవన్ ఎందుకు పట్టించుకోవటం లేదు ? పైగా అమరావతిలో జగన్ రెడ్డి ఇల్లు కట్టుకున్న కారణంగానే పెట్టుబడులు వచ్చాయని చెప్పటం మరింత విచిత్రంగా ఉంది. ప్రతిపక్షంలో ఉన్న జగన్ను చూసి అమరావతికి పెట్టుబడులు వచ్చాయా ? అసలు అమరావతికి వచ్చిన పెట్టుబడులు ఏమిటో పవన్ చెప్పగలరా ?

ఒకపుడు ఇదే పవన్ కర్నూలుకు వెళ్ళి రాష్ట్రానికి రాజధాని అమరావతే అయినా తన వరకు కర్నూలే రాజధాని అని బహిరంగ సభలో చెప్పారు. అలాగే మరోసారి వైజాగ్ వెళ్ళినపుడు విశాఖపట్నాన్నే రాజధానిగా చేయాలని చేసిన డిమాండ్ ను పవన్ మరచిపోయినట్లున్నారు. ప్రత్యేక తెలంగాణా ఉద్యమంలో జనాలు రోడ్లపైకి వచ్చినట్లే అమరావతి విషయంలో కూడా జనాలు బయటకు రావాలని పిలుపిచ్చారు. పిలుపు వరకు బాగానే ఉంది కానీ మరి అమరావతి కోసం జనాలు ఎందుకు రోడ్లపైకి రాలేదు ? ఆ విషయాన్ని పవన్ ఆలోచించారా ? చంద్రబాబు పదే పదే పిలుపిస్తున్నా జనాలు కాదు కదా కనీసం పార్టీ నేతలు కూడా ఎందుకు రోడ్డెక్క లేదు ?