ఏపీలో వైసీపీ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. 2019లో ఎంత ఉవ్వెత్తున ఎగిసి.. అధికారంలోకి వచ్చిందో ఇప్పుడు అంతే కిందకు పడిపోయింది. 151 స్థానాల నుంచి 11 స్థానాలకు ఆ పార్టీ పడిపోయింది. ఇదేమీ అంత తేలికగా తీసుకునే విషయం కాదు.
అనేక లక్షల కోట్ల సంక్షేమం అమలు చేశామని జగన్ చెప్పినప్పటికీ.. ప్రజలు ఆయనను చేరువ కానివ్వలేదు. మరోసారి అధికారమూ అప్పగించలేదు. దీంతోఇప్పుడు కేవలం 11 మంది మాత్రమే ఆయనకు ఎమ్మెల్యేలు మిగిలారు.
అయితే.. ఇప్పుడు తెరచాటున జరుగుతున్న చర్చలు.. వ్యూహాలకు సంబంధించి సంచలన సమాచారం వెలుగు చూస్తోంది. వచ్చే ఐదేళ్ల పాటు.. రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని భావిస్తున్న గెలిచిన వారు కూడా.. వైసీపీకి దూరం అవుతున్నట్టు సమాచారం.
బీజేపీకి చెందిన కీలక నేతలు ఇద్దరు.. వైసీపీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలతో టచ్‌లోకి వెళ్లారని.. వారిని తమ పార్టీలోకి ఆహ్వానించారని సమాచారం. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలను బీజేపీ టార్గెట్ చేసినట్టు సమాచారం.
నిజానికి వైసీపీ గెలిచిన 11 స్థానాల్లో జగన్ ఒకరు, ఇక, వీర విధేయులు అనదగ్గ వారిలో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి(పుంగనూరు), పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి(తంబళ్లపల్లె), బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి(దర్శి) మాత్రమే ఉన్నారు. మిగిలిన వారంతా.. కూడా పెద్ద వీర విధేయులు అయితే కాదు. ఈ వీక్నెస్ పైనే బీజేపీ దృస్టి పెట్టినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో వైసీపీ నుంచి విజయం దక్కించుకున్న వారిని తమవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
వీరిలో అరకు నుంచి గెలిచిన రేగా మత్స్యలింగ్, పాడేరులో విజయం దక్కించుకున్న మత్స్యరాస విశ్వేశ్వరరాజు, యర్రగొండ పాలెం విజేత తాటిపత్రి చంద్రశేఖర్, ఆలూరు లో గెలుపు గుర్రం ఎక్కిన బీ. విరూపాక్షి, మంత్రాలయంలో గెలిచిన వై.బాలనాగిరెడ్డి, బద్వేలులో గెలిచిన దాసరి సుధ, రాజంపేట నుంచి విజయం దక్కించుకున్న ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఉన్నారు. వీరిలో కనీసం ఐదుగురు పార్టీ మారే అవకాశం ఉందని సమాచారం.అది కూడా.. కూటమి సర్కారు కొలువుదీరే నాటికి జరిగిపోతుందని తెలుస్తోంది. ఇదే జరిగితే.. వైసీపీలో జగన్ తప్ప.. మరెవరూ పెద్దగా కనిపించే అవకాశం లేదని అంటున్నారు.