వైసిపి ఓటింగ్ 16 శాతం పడిపోయిందా ?

పార్టీ నేతలతో జరిగిన జూమ్ కాన్ఫరెన్సులో ప్రభుత్వానికి సంబంధించి చంద్రబాబునాయుడు ఓ ఆసక్తికరమైన విషయం బయటపెట్టారు. అదేమిటంటే అధికార వైసిపికి 16 శాతం మంది జనాలు దూరమైనట్లు చెప్పారు. ప్రజల మద్దతును ప్రభుత్వంలో ఉన్న వైసిపి 16 శాతం కోల్పోయినట్లు చంద్రబాబు చెప్పగానే నేతలంతా ఆశ్చర్యపోయారు.

సర్కారుపై విశ్వాసం కోల్పోయిన వారిలో అధికులు ఎస్సీ, ఎస్టీ, బిసిలే అని చెప్పారు. జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతోందని చెప్పటమే చంద్రబాబు ఉద్దేశ్యం అయుండచ్చు. మరలాంటపుడు ఎస్సీ, ఎస్టీ, బిసిల్లో మాత్రమే అధికంగా వ్యతిరేకత కనబడుతోందని, ఆ వర్గాలు మాత్రమే ప్రభుత్వానికి దూరమైనట్లు చంద్రబాబు చెప్పడం వెనుక 2019లో వారిలో ఎక్కువమంది జగన్ పార్టీకి మద్దతు వేసినట్లు చంద్రబాబు అర్థం చేసుకున్నారు అనుకోవాలి.

నిజానికి 16 శాతం అంటే మామూలు విషయం కాదు. మరి ఇంత పెద్ద శాతం జనాలు ప్రభుత్వానికి ఎందుకు వ్యతిరేకమయ్యారో కూడా చంద్రబాబు స్పష్టంగా చెప్పలేదు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి జగన్ అనుసరిస్తున్న విధానాల కారణంగా పై వర్గాల వాళ్ళపై దాడులు, అత్యాచారాలు ఎక్కువైపోతున్నాయట. అందుకనే పై వర్గాలంతా ప్రభుత్వానికి దూరమైపోయారని చంద్రబాబు చెప్పారు. ప్రభుత్వ పనితీరుపైన చంద్రబాబు ఏమైనా సర్వే చేయించారా ? ప్రభుత్వంపై జనాభిప్రాయాన్ని టిడిపి ఏమైనా సేకరించిందా ? లేకపోతే ఈ పనులు చేయటానికి చంద్రబాబు ఏదైనా ఏజెన్సీని నియమించారా ? అన్న విషయాల్లో స్పష్టత లేదు.

పార్టీ నేతలతో మాట్లాడుతు 16 శాతం జనాలు దూరమైనట్లు మాత్రమే చెప్పారు. అందుకు తన దగ్గరున్న ఆధారం ఏమిటో కూడా చెప్పుంటే బాగుండేది. బహుశా ఎన్నికలకు ముందు చంద్రబాబు తరపున రాష్ట్రంలో సర్వే చేసిన సంస్థలు ఏమైనా తాజాగా సర్వే చేశాయా? అన్నది ఒక ప్రశ్న. వాటిని కూడా బయటపెట్టి ఉంటే ఈ విషయం మరింతగా సంచలనం అయ్యేది.