బీఆర్ఎస్ ప్లేస్‌లో టీడీపీ.. తెలంగాణ‌లో బాబు వ్యూహం!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యంతో టీడీపీ అధినేత‌, కాబోయే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఫుల్ జోష్‌లో ఉన్నారు. అంతేకాకుండా టీడీపీ 16 ఎంపీ సీట్లు గెల‌వ‌డంతో కేంద్రంలోని ఎన్డీయే ప్ర‌భుత్వంలోనూ బాబుకు అధిక ప్రాధాన్య‌త ల‌భిస్తోంది. దీంతో అటు బాబు, ఇటు టీడీపీ శ్రేణుల ఆనందానికి అంతేలేదు. ఈ సంతోషంలోనే ఇక తెలంగాణ‌పై ఫోక‌స్ పెట్టాల‌ని బాబు నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలిసింది. ఏపీలో తిరిగి అధికారం ద‌క్కింది. ఇక‌పై తెలంగాణ‌లోనూ తిరిగి పుంజుకునే దిశ‌గా టీడీపీని న‌డిపించాల‌న్న‌ది బాబు ల‌క్ష్యంగా క‌నిపిస్తోంది.

ప్ర‌స్తుతం తెలంగాణ‌లో కాంగ్రెస్‌, బీజేపీ మ‌ధ్య హోరాహోరీ ప‌రిస్థితి నెల‌కొంది. బీజేపీ కంటే కాంగ్రెస్ బ‌లంగా ఉన్న‌ప్ప‌టికీ బీజేపీ కూడా పుంజుకునే ప్ర‌య‌త్నాల‌ను గ‌ట్టిగానే చేస్తోంది. మ‌రోవైపు గ‌తేడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ప‌రాభ‌వంతో, తాజాగా లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో సున్నా సీట్ల‌తో బీఆర్ఎస్ ప‌త‌నం వేగంగా సాగుతోంది. ఆ పార్టీ ఉనికే తీవ్ర‌మైన ప్ర‌మాదంలో ప‌డింది. దీంతో ఇప్పుడు తెలంగాణ‌లో బీఆర్ఎస్ స్థానాన్ని ఆక్ర‌మించుకునే ఆలోచ‌న‌లో బాబు ఉన్న‌ట్లు తెలిసింది.

ఇప్ప‌టికే కూట‌మి కార‌ణంగా జ‌న‌సేన‌, బీజేపీతో టీడీపీ పొత్తులో ఉంది. ఇదే పొత్తును తెలంగాణ‌లోనూ కొన‌సాగిస్తే తిరిగి పుంజుకునే ఆస్కార‌ముంద‌న్న‌ది విశ్లేష‌కుల అంచ‌నా. బాబు కూడా ఇదే కోరుకుంటున్నారు. తెలంగాణ‌లో పార్టీ పున‌ర్నిర్మాణం దిశ‌గా ఇక్క‌డి టీడీపీ నాయ‌కుల‌తో బాబు భేటీ అయ్యారు. తెలంగాణ‌లో తిరిగి పుంజుకోవాల‌ని దిశానిర్దేశం చేశారు. ఇక ఇక్క‌డ టీడీపీలోని కీల‌క నేత‌లు బ‌య‌ట‌కు వెళ్లిపోయారు కానీ క్షేత్ర‌స్థాయిలో ఇంకా క్యాడ‌ర్ ఉంద‌ని బాబు న‌మ్ముతున్నారు. వాళ్ల‌కు తాను ఉన్నాన‌నే భ‌రోసా క‌ల్పించాల‌ని చూస్తున్నారు. ఇత‌ర పార్టీలోకి వెళ్లిన టీడీపీ నాయ‌కులు కూడా తిరిగొస్తార‌నే న‌మ్మ‌కంతో బాబు ఉన్న‌ట్లు తెలిసింది. ముందుగా టీడీపీ తెలంగాణ అధ్య‌క్షుడిని నియ‌మించి, ఆ త‌ర్వాత ప్ర‌త్యేక వ్యూహంతో సాగాల‌ని బాబు అనుకుంటున్న‌ట్లు టాక్‌.