ఎంతలో ఎంత మార్పు. ఒకప్పుడు సొంత పార్టీ నాయకులనూ కలిసేందుకు అపాయింట్‌మెంట్ ఇవ్వని జగన్.. ఇప్పుడు పెద్దగా పని లేకపోవడంతో ఎవరు వచ్చినా కలుస్తున్నారని తెలిసింది. తాడేపల్లి కోటలో రాజులాగా భావించి, ఎవరినీ తన దగ్గరకు కూడా రానివ్వని జగన్.. ఇప్పుడు అందరితో మాట్లాడుతున్నారని సమాచారం. అప్పుడేమో ఎవరడిగినా నో అపాయింట్‌మెంట్ అన్న జగన్.. ఇప్పుడు ఫ్రీ టైమ్ ఉంది రమ్మని అంటున్నారనే సెటైర్లు వినిపిస్తున్నాయి.
జగన్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత తన చుట్టూ ఓ కోటరీ నిర్మించుకున్నారు. ఓ కోటను ఏర్పాటు చేసుకున్నారు. తాను రాజుననే నియంతృత్వ ధోరణితో వ్యవహరించేవాళ్లని వైసీపీ నాయకులే గతంలో విమర్శించారు. సొంత పార్టీ నేతలనే కలిసేందుకు జగన్ ఇష్టపడలేదు. ఇక వైసీపీ కార్యకర్తలు, సామాన్య ప్రజల సంగతి అంతే. పార్టీ ఎమ్మెల్యేలే అపాయింట్‌మెంట్ అడిగినా ఇవ్వకపోతే ఎలా అని చాలా సందర్భాల్లో వైసీపీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేశారు.
కానీ ఇప్పుడు ఎన్నికల్లో ఘోర పరాభవంతో జగన్‌కు తలపొగరు తగ్గిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు ఎవరినీ లోపలికి రానివ్వని జగన్.. ఇప్పుడు ఎవరొచ్చినా మాట్లాడుతున్నారని తెలిసింది. ఇప్పుడు జగన్‌ను కలిసేందుకు వైసీపీ నేతలకు ఎలాంటి అపాయింట్‌మెంట్ అవసరం లేదు. తాడేపల్లిలోని జగన్‌ను ఆయన నివాసంలో చాలా మంది వైసీపీ నేతలు ఇప్పటికే కలిశారు. ఇంకా కొంతమంది కలవడానికి వస్తున్నారు. వీళ్లెవరూ అపాయింట్‌మెంట్ అడగడం లేదు. కేవలం తాము వస్తున్నామనే సమాచారం మాత్రమే ఇచ్చి జగన్‌ను కలుస్తున్నారు. ఈ ఓటమితోనైనా పార్టీ నేతలు, కార్యకర్తలతో జగన్ కలిసే అవకాశం వచ్చిందనే సెటైర్లు వినిపిస్తున్నాయి.