“అమరావతిని రాజధానిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం.. నేను ఇక్కడే ఇల్లు కూడా కట్టుకుంటున్నా” అంటూ ఘనమైన ప్రకటనలు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి.. 2019 ఎన్నికల తర్వాత ఎలా ప్లేటు ఫిరాయించి మూడు రాజధానుల ప్రతిపాదనతో అమరావతికి ఎలా మరణ శాసనం రాశారో తెలిసిందే. ఐతే అమరావతిని చంపడానికి ఆయన చేసిన ప్రయత్నం.. చివరికి వైసీపీ పతనానికి దారి తీసింది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాభవం చవిచూసింది. రాజధాని చుట్టు పక్కల ఎక్కడా వైసీపీ ఖాతా తెరవలేదు. భారీ తేడాతో ఆ పార్టీ అభ్యర్థులు ఓటమి చవిచూశారు.
అమరావతి విషయంలో జగన్ ఆడిన గేమ్ తమ పార్టీని దారుణంగా దెబ్బ కొట్టిందని ఇప్పుడు వైసీపీ నేతలు అంతర్గతంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ పోగానే ఇక అమరావతికి పునరుజ్జీవం వచ్చినట్లే అన్న భావన సర్వత్రా వ్యక్తమైంది.
కాగా చంద్రబాబు సారథ్యంలో ఇంకా కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాకముందే అమరావతిలో యాక్టివిటీ మొదలైపోయింది. ఐదేళ్ల పాటు స్తబ్ధుగా ఉండిపోయిన సీఆర్డీఏ.. హడావుడిగా పనులు మొదలుపెట్టేసింది. ఒకప్పుడు రాజధానికి శంకు స్థాపన జరిగిన ప్రాంతం జగన్ హయాంలో శ్మశానాన్ని తలపించగా.. ఇప్పుడక్కడ చెట్లు కొట్టించి శుద్ధి చేసి అందంగా తయారు చేస్తున్నారు. ఆ ప్రాంత రోడ్లను కూడా బాగు చేస్తున్నారు. చంద్రబాబు ఈసారి ప్రమాణ స్వీకారం చేయబోయేది అమరావతి నుంచే అన్న సంగతి తెలిసిందే. ఆ లోపే రాజధాని ప్రాంతాన్ని వీలైనంత అందంగా తయారు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అధికారంలోకి వచ్చాక బాబు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపించే ప్రాజెక్టుల్లో రాజధాని ఒకటనడంలో సందేహం లేదు. గతంలో కంటే వేగంగా ఇక్కడ పనులు చేయించి జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి ప్రయత్నాలు జరగొచ్చు.
Gulte Telugu Telugu Political and Movie News Updates