ఈ దూకుడుతో సాధించేందేంటి? వైసీపీలో అంత‌ర్మ‌థ‌నం

రాజ‌కీయాల్లో దూకుడు మంచిదే. అయితే, ఈ దూకుడు పార్టీకి ప్ర‌మాద‌క‌రం కాకుండా చూసుకోవాలి. అదే స‌మ‌యంలో నేత‌ల మ‌ధ్య చిచ్చు పెట్ట‌కుండా కూడా చూసుకోవాలి. ఈ విష‌యంలో పార్టీలు అనుస‌రించే వ్యూహం అత్యంత కీల‌కం. గ‌తంలో చంద్ర‌బాబు ఇలా దూకుడుగా ముందుకు వెళ్లి వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేల‌ను అవ‌స‌రం లేకున్నా చేర్చుకున్నారు. దీంతో ఏం జ‌రిగింది. ఎక్క‌డిక‌క్క‌డ గ్రూపు రాజ‌కీయాలు వ‌ర్గ పోరు పెరిగిపోయి.. పార్టీ పైకి బాగానే ఉన్న‌ట్టు క‌నిపించినా.. అంత‌ర్గ‌త కుమ్ములాట‌ల‌తో అభాసుపాలైంది.

ఇక‌, ఇప్పుడు ఇదే ఫార్ములాతో ముందుకు సాగుతున్నారు సీఎం జ‌గ‌న్‌. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో 151 మంది ఎమ్మెల్యేల‌తో భారీ విజ‌యం సాధించి ప్ర‌భుత్వం ఏర్పాటు చేసుకున్న వైసీపీ అధినేత ఇప్పుడు టీడీపీ నుంచి నేత‌ల‌ను లాగేస్తున్నారు. నిజానికి ఇప్పుడు ఆయ‌న‌కు వీరితో అవ‌స‌రం ఉందా? పోనీ.. వీరిని లాగేసుకున్నంత మాత్రాన టీడీపీ నామ‌రూపాలు లేకుండా పోతుందా? అదేమీ జ‌ర‌గ‌దు. ఈ విష‌యం తెలిసి కూడా ఆయ‌న దూకుడు త‌గ్గించ‌లేదు. చీరాల‌, గుంటూరు వెస్ట్‌, య‌ల‌మంచిలి, గ‌న్న‌వ‌రం.. రామ‌చంద్ర‌పురం, తాడికొండ నియోజ‌క‌వ‌ర్గాల‌కు చెందిన నేత‌ల‌ను త‌న పార్టీలో చేర్చుకున్నారు.

ఇలా వ‌చ్చిన వారు ఊరికేనే ఉంటే.. ప‌రిస్థితి వేరేలా ఉండేది. కానీ, టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేసిన నాయ‌కులు.. ఆధిప‌త్య రాజ‌కీయాల‌కు తెర‌దీస్తున్నారు. తామే నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జుల‌మ‌ని ప్ర‌క‌టించుకుంటున్నారు. గ‌న్న‌వ‌రంలో వ‌ల్ల‌భ‌నేని వంశీ, గుంటూరు వెస్ట్‌లో మ‌ద్దాలి గిరి, చీరాల‌లో క‌ర‌ణం బ‌ల‌రా.. ఇలా ప్ర‌క‌టించుకున్న‌వారే. దీనివ‌ల్ల నియోజ‌క‌వ‌ర్గాల్లో గ్రూపు రాజ‌కీయాలు పెరిగిపోతు న్నాయి. ఫ‌లితంగా వైసీపీని అధికారంలోకి తీసుకువ‌చ్చేందుకు నిరంత‌రం కృషి చేసిన నాయ‌కులు త‌ల్ల‌డిల్లి పోతున్నారు. పార్టీలోకి తీసుకుంటే.. తీసుకున్నారు.. ఇంత ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శిస్తే.. మేమేం చేస్తాం.. ఇక‌, పార్టీలో ఉండాలా? వ‌ద్దా? అనే మీమాంశ‌లో చిక్కుకుంటున్నారు.

మ‌రికొంద‌రు అధిష్టానంపై అంత‌ర్గ‌తంగా నిప్పులు చెరుగుతుంటే.. ఇంకొంద‌రు.. టీడీపీ నుంచి వ‌చ్చిన నేత‌ల‌తో ఎంత‌కైనా రెఢీ! అంటూ.. త‌ల‌ప‌డుతున్నారు. దీనివ‌ల్ల పార్టీని ప‌ట్టించుకునే నాథులు త‌గ్గిపోతున్నారు. అంత‌ర్గ‌త కుమ్ములాట‌ల‌కే స‌మ‌యం స‌రిపోతోంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఈ ప‌రిస్థితి ఇలానే ఉంటే పార్టీ వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఏవిధంగా త‌యార‌వుతుంది? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. మ‌రి జ‌గ‌న్ వ్యూహం చివ‌ర‌కు ఏం చేస్తుందో చూడాలి.