పవన్ తిక్కకూ ఓ లెక్కుంది !

‘ఎక్కడ నెగ్గాలో కాదు .. ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు’ పవన్ కళ్యాణ్ సినిమాలోని ఈ డైలాగ్ ఇప్పుడు ఏపీ రాజకీయ శ్రేణుల నోళ్లలో నానుతుంది. ఏపీ ఎన్నికలలో ఈ సారి పవన్ కళ్యాణ్ వ్యవహరించిన తీరుకు ఈ డైలాగ్ చక్కగా అద్దంపడుతుంది. అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి పవన్ కళ్యాణ్ పదేళ్లు నిరీక్షించి చివరకు విజయం సాధించాడు.

నాలుగు పెళ్లిళ్లు, రెండుచోట్లా ఓడిపోయాడు అంటూ అవహేళనలు. కానీ ఇవేవీ పవన్ లెక్క చేయలేదు. ఏపీ ఎన్నికల్లో కూటమి విజయం వెనక ప్రధానంగా చంద్రబాబు అనుభవం. పవన్ కల్యాణ్ త్యాగం ఉన్నాయి. 2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాక రెండింటిలోనూ పవన్ ఓడిపోయినప్పుడు ఆయనకు రాజకీయాలు ఎందుకనే విమర్శలు వచ్చాయి. దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ అంటూ సెటైర్లు వేశారు. 175 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దించే సత్తా కూడా లేదని ఎద్దేవా చేశారు. అయినా కూడా పవన్ బాధపడలేదు. అన్నీ పంటి బిగువున భరిస్తూ వైసీపీని కోలుకోలేని దెబ్బకొట్టడంలో కీలకపాత్ర పోషించాడు.

2019 ఎన్నికల తర్వాత వ్యూహం మార్చిన పవన్ కల్యాణ్ పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాడు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లినప్పుడు పవన్ ఆయనకు సంఘీభావం ప్రకటించి.. పొత్తు ప్రకటించారు. ఈ పరిణామంతో ఏపీలో రాజకీయాలు మారిపోయాయి. టీడీపీతో జట్టుకట్టిన పవన్ బీజేపీని కూడా కూటమిలోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. పొత్తు కోసం ఒకానొక సమయంలో తాను మోదీ, అమిత్‌షాతో తిట్లు తిన్నానంటూ చెప్పారు పవన్. చివరకు ఆయన ప్రయత్నాలు ఫలించి బీజేపీ టీడీపీ, జనసేనతో పొత్తుకు ఒప్పుకుంది.

ఎలాగోలా పొత్తు కుదిరినప్పటికీ సీట్ల కేటాయింపులో పెద్ద చిక్కులు వచ్చాయి. అప్పుడు కూడా పవన్ కల్యాణ్ వెనక్కి తగ్గారు. చివరకు జనసేన సీట్లను బీజేపీకి త్యాగం చేసి కూటమిని నిలబెట్టాడు. కేవలం 21 శాసనసభ, 2 లోక్ సభ స్థానాలకు పరిమితం అయ్యాడు. రెండున్నరేళ్లు సీఎం పదవి డిమాండ్ చేయాలన్న వాదనలను కూడా పవన్ అస్సలు పట్టించుకోలేదు. ఎట్టకేలకు ఏపీలో కూటమి 175 స్థానాలకు గాను 164 స్థానాలు గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. జనసేన పోటీ చేసిన అన్ని స్థానాలను గెలుచుకోవడం విశేషం. ఇప్పుడు అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో కీలకనేతగా పవన్ ఎదిగాడు.