రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు. కానీ ప్రజల మనసులను ఎప్పటికప్పుడు గెలుచుకున్న నాయకులకు బంగారు భవిష్యత్తు స్వాగతం చెబుతూనే ఉంటుంది. ఎంత కిందపడినా సరే లేచే అవకాశాన్ని బంగారు పళ్లెంలో ఇస్తుంది. దానికి మూడు అత్యుత్తమ ఉదాహరణలు కళ్ళముందు కనిపిస్తున్నాయి.
నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవమున్న చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల్లో కేవలం పాతిక లోపే సీట్లకు పరిమితం కావాల్సి వస్తుందని ఎవరూ ఊహించలేదు. అధికారం ఉందన్న గర్వంతో పాలక పక్షం చేసిన అవమానానికి తిరిగి సిఎంగానే అసెంబ్లీలో అడుగు పెడతానని ఆయన చేసిన శపథం ఒక ఘట్టం.
అయిదేళ్ళు గడిచేసరికి రెండు పర్యాయాలు కేంద్రంలో ఉన్న మోడీ సర్కార్ సైతం ఇప్పుడు మద్దతు కోరేంత గొప్ప విజయాన్ని 2024లో చంద్రబాబు సాధించారు. నూటా అరవైకి పైగా కూటమి స్థానాలను గెలిచి వైసిపికి కనీసం ప్రతిపక్ష హోదా దక్కకుండా చేయడం వెనుక నెలల తరబడి ప్రణాళిక, డెబ్భై వయసు దాటినా లెక్కచేయని పట్టుదల ఉన్నాయి.
ఇక పవన్ కళ్యాణ్ ఎదురుకున్న అవమానాల గురించి ఏకంగా సినిమానే తీయొచ్చు. జనసేన పెట్టిన తర్వాత రెండు దఫాలు ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపించలేకపోవడాన్ని ఎందరో అలుసుగా తీసుకున్నారు. ప్యాకేజీ స్టార్ అనడమే కాక తీవ్రంగా వ్యక్తిగత దూషణలు చేశారు.
ఇప్పుడు అదే పవర్ స్టార్ ఏకంగా పవర్ సెంటర్ గా మారారు. ఇరవై ఒక్క సీట్లలో ఏ ఒక్కటి కోల్పోకుండా వంద శాతం స్ట్రైక్ రేట్ తో చరిత్ర సృష్టించి అందరి నోళ్లు మూయించారు. ఏకంగా ఢిల్లీ ఎన్డిఏ మీటింగ్ కి ఆహ్వానం అందుకున్నారు. తన గురించి జాతీయ మీడియా మాట్లాడుకునేలా చేశారు.
ఇక మూడో వ్యక్తి నారా లోకేష్. గత ఎలక్షన్లలో మంగళగిరి నుంచి ఓటమి చెందినప్పుడు తన ఇంగ్లీష్ వాచకంతో మొదలుపెట్టి రూపం దాకా సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని అన్ని రకాల ట్రోలింగ్ చేశారు. కానీ వెనుకడుగు వేయలేదు. ఓడిన చోటే పంతంతో నిలబడి 90 వేలకు పైగా మెజారిటీతో జయకేతనం ఎగరేశారు.
ఈ ముగ్గురితో పాటు ఎందరో విజయాలు సాధించినా వీళ్ళనే ప్రత్యేకంగా ప్రస్తావించడానికి కారణం ఉంది. అట్టడుగున ఉన్న క్యాడర్ మనోస్థైర్యాన్ని మేలుకొలిపి అందరినీ ఒకటే తాటిపైకి తీసుకురావడంలో త్రిమూర్తులు చూపించిన చొరవ మాటల్లో చెప్పేది కాదు. ఏ మాత్రం తడబడినా ఘోర పరాజయాలకు దారి తీసే సున్నితమైన పొలిటికల్ వాతావరణంలో సూదిలో దారం ఎక్కించినంత శ్రద్ధగా ప్రతి విషయంలో శ్రద్ధ తీసుకుని అద్భుతాలు సృష్టించారు. ఇంకో తరానికి సరిపడా నమ్మకపు సామ్రాజాన్ని సృష్టించారు. అందుకే ఈ స్ఫూర్తి గీతం ఎప్పటికీ మర్చిపోలేని గొప్ప రాజకీయ పాఠం.