పిన్నెల్లి అరెస్టు… ఏ క్ష‌ణ‌మైనా!

వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డిని అరెస్టు చేసేందుకు రంగం రెడీ అయింది. హైకోర్టు ఇచ్చిన ముంద‌స్తు బెయిల్ గ‌డువు బుధ‌వారంతో తీరిపోతుంది. దీంతో ఆయ‌న‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నార‌ని తెలుస్తోంది. మ‌రోవైపు పిన్నెల్లికి సంబంధించిన కేసుల‌ను గురువారం హైకోర్టు మ‌రోసారి విచారించ‌నుంది. ఈ నేప‌థ్యంలో క‌ఠిన చ‌ర్య‌లు, ఆదేశాలు కూడా ఉంటాయ‌ని న్యాయ నిపుణులు అంటున్నారు.

ఏం జ‌రిగింది?

గ‌త నెల 13న జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ స‌మ‌యంలో మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలోని పాల్వాయి గేటు బూత్‌లో ఈవీఎం, వీవీ ప్యాట్‌ను ధ్వంసం చేయ‌డం, దీనిని అడ్డుకోబోయిన టీడీపీ ఏజెంట్ శేష‌గిరి రావుపై దాడి చేయ‌డం.. చివ‌ర‌కు హ‌త్యాయ‌త్నం చేయ‌డం.. వంటివి పిన్నెల్లి ఎదుర్కొంటున్నారు. దీంతో పాటు సీఐ నారాయ‌ణ స్వామి పైనా హ‌త్యాయ‌త్న జ‌రిగింద‌ని.. దీనికి కార‌ణం కూడా.. పిన్నెల్లేన‌ని పోలీసులు కేసులు న‌మోదు చేశారు. దీనిపై ఏర్పాటైన సిట్ ప‌లు నివేదిక‌లు కూడా ఇచ్చింది.

ఈ క్ర‌మంలో పరారైన పిన్నెల్లి.. త‌న‌ను పోలీసులు అరెస్టు చేయ‌కుండా వెళ్లిపోయారు. ఇంతోలోనే మ‌రోవైపు.. హైకోర్టును ఆశ్ర‌యించి ముంద‌స్తు బెయిల్ పొందారు. ఎన్నిక‌ల కౌంటింగ్ ఉంద‌ని.. తాను ఎన్నిక‌ల కౌంటింగ్ స‌మ‌యంలో పాల్గొన‌క‌పోతే.. న‌ష్ట‌పోయే అవ‌కాశం ఉందని ఆయ‌న కోర్టును ఆశ్ర‌యించారు. ఈక్ర‌మంలోనే హైకోర్టు పిన్నెల్లికి ముంద‌స్తు బెయిల్ ఇచ్చింది. అనంత‌రం.ఆయ‌న బ‌య‌ట‌కు వ‌చ్చారు. అయితే.. కొన్ని ష‌రతుల‌కు లోబ‌డి.. ఆయ‌న వ్య‌వ‌హ‌రించాల‌ని హైకోర్టు పేర్కొంది.

మాచ‌ర్ల‌కు వెళ్ల‌రాద‌ని.. రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేయ‌రాద‌ని.. మీడియాతోనూ మాట్లాడ‌కూడ‌ద‌ని పేర్కొంది. అయితే.. కౌంటింగ్ కేంద్రానికి మాత్రం వెళ్లొచ్చ‌ని హైకోర్టు అవ‌కాశం ఇచ్చింది. ఈ ముంద‌స్తు బెయిల్ జూన్ 5వ తేదీ వ‌ర‌కు వ‌ర్తిస్తుంద‌ని కోర్టు పేర్కొంది. అయితే.. దీనిని.. టీడీపీ నాయ‌కుడు శేష‌గిరిరావు.. సుప్రీంకోర్టులో స‌వాల్చేశారు. దీనిని ప‌రిశీలించిన సుప్రీంకోర్టు.. హైకోర్టు ఇచ్చిన ముంద‌స్తు బెయిల్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఇదేం తీర్ప‌ని.. హైకోర్టు పెద్ద త‌ప్పు చేసింద‌ని వ్యాఖ్యానించింది. జూన్ 6న జ‌రిగే విచార‌ణ‌లో ఖ‌చ్చితంగా దీనిని ప‌రిష్క‌రించాల‌ని ఆదేశించింది. దీంతో పిన్నెల్లికి కోర్టు క‌ష్టాలు మామూలుగా లేవ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.