‘ఎమ్మెల్యేగా నేను సంపూర్ణ జీతం తీసుకుంటాను. నేను ప్రజల సొమ్మును తింటున్నాను అనే బాధ్యతను ప్రతి క్షణం గుర్తుంచుకోవాలనే ఈ జీతం తీసుకుంటున్నాను. నేను సరిగా పని చేయకుంటే ప్రతి రూపాయికి నన్ను చొక్కా పట్టుకుని నిలదీసే హక్కు ప్రజలకు ఉండాలి. అందుకే ఈ జీతం తీసుకుంటున్నాను. తర్వాత నేను తిరిగి ఇచ్చేది ఇచ్చేస్తాను. ఇంతకు వేయింతలు ఇచ్చేస్తాను.. అది వేరే విషయం’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఆత్మీయ సమావేశం సందర్భంగా ఆయన ఈ మాటలు అన్నారు.
చట్టాలు చేసేవాళ్లు అంటే ఎలా ఉండాలో చూపిద్దాం. పార్లమెంటుకు వెళ్లేది పరిచయాల కోసం కాదు. ప్రజల కోసం పని చేయడానికి అని గుర్తుంచుకోవాలి అని పవన్ కళ్యాణ్ సూచించారు. రక్తం ధారపోసిన జనసైనికులు, గడప దాటని వీర మహిళలు మన పార్టీని గెలిపించారు. కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉండేటువంటి విజయం సాధించాం అని గుర్తు చేశారు.
ఇల్లు అలకగానే పండుగ కాదు. పండుగ చేసుకునే సమయం కూడా కాదు. ఇది బాధ్యతతో ఉండాల్సిన సమయం. విజయంతో వచ్చే అతిశయం వద్దు. పార్టీలో కూడా ఎవ్వరూ పెట్టుకోవద్దు అని పవన్ హెచ్చరించారు. కేంద్రంలో కీలక భాగం కాబోతున్నాం. ఎంపీలు ఉదయ్, బాలశౌరీలకు చాలా బాధ్యత ఉంది. ఢిల్లీలో జనసేన ఎంపీల కదలికలను ప్రతి ఒక్కరూ పరిశీలిస్తారు. ఏపీ ప్రజల తరపున లోక్ సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని పవన్ సూచించారు.