ఏపీలో ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ఫలితాలపై టీడీపీ అధినేత చంద్రబాబు తొలిసారిగా స్పందించారు. ఉండవల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలుపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కూటమికి అఖండ విజయాన్ని కట్టబెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత పాలకులుగా కాకుండా ప్రజా సేవకులుగా పనిచేస్తామని చంద్రబాబు చెప్పారు.
ముందు మీడియాకు, ఆ తర్వాత ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చిందని అన్నారు. తన సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఎన్నో ఎన్నికలు, గెలుపోటములు, రాజకీయాల్లో ఒడిదుడుకులు చూశానని, కానీ ఈ ఎన్నికల ప్రత్యేకమని చెప్పారు. ఈ ఎన్నికల్లో జగన్ ను ఓడించాలి అన్న కసి, వేవ్ కనిపించాయని చెప్పారు.
ఐదేళ్ల వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను ఏ విధంగా నిర్వీర్యం చేశారో చూశామని అన్నారు. ఈ తీర్పు రాష్ట్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గదన్నారు. ప్రజాకాంక్షలు, ఆశలకు అనుగుణంగా పాలన సాగిస్తామని, రాష్ట్ర పునర్మాణానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. అహంకారం, నియంతృత్వం, విచ్చలవిడితనంతో ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే ప్రజలు క్షమించరు అనే విషయాన్ని ఈ ఎన్నికలు నిరూపించాయన్నారు.
రాష్ట్రాభివృద్ధి కోసం ప్రజలు, యువత భవిష్యత్తు కోసం పొరుగు రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి కూడా లక్షలాది రూపాయల డబ్బులు ఖర్చు పెట్టుకుని వచ్చి ఓటు వేశారని అభినందించారు. అసెంబ్లీలో తనకు, తన భార్యకు జరిగిన అవమానం ఎంతో ఆవేదనకు గురిచేసిందని బాధపడ్డారు. అందుకే, ఆ కౌరవసభలో ఉండలేనని, దానిని గౌరవ సభ చేశాకే తిరిగి అడుగుపెడతానని తాను చేసిన ప్రతిజ్ఞకు ప్రజలు సహకరించారని ధన్యవాదాలు తెలిపారు.
కూటమి ఏర్పడడంలో పవన్ కళ్యాణ్ ది కీలక పాత్ర అని, అందుకు ఆయనకు ధన్యవాదాలు చెప్పారు. 175 నియోజకవర్గాల్లో కూటమిలోని పార్టీలన్నీ తమవిగా భావించి కలిసికట్టుగా పనిచేశాయని చంద్రబాబు చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పవన్ కళ్యాణ్ కు, బిజెపి అగ్ర నేతలకు, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి, జనసేన నేతలకు చంద్రబాబు కృతజ్ఞతలు చెప్పారు. ప్రజలు కూడా తమ పాలనపై ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ ఇవ్వాలని, ఓటు వేసే మా పని అయిపోయింది అనుకోవద్దని అన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates