తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు ముందు పలువురు బీఆర్ఎస్ నేతలు, సిట్టింగ్ ఎంపీలు పార్టీలు మారి కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుండి పోటీ చేశారు. అయితే పార్టీ మారి పోటీచేసిన వారిలో కడియం కావ్య, గోడెం నగేశ్ మినహా మిగిలినవారంతా ఓటమిపాలయ్యారు. ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన కావ్య వరంగల్ నుంచి గెలుపొందగా, బీఎస్పీ నుంచి బీజేపీలో చేరి ఆదిలాబాద్ నుంచి పోటీచేసిన గోడెం నగేశ్ విజయాన్ని అందుకున్నాడు. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ నుంచి జహీరాబాద్ ఎంపీగా విజయం సాధించిన బీబీ పాటిల్ ఈ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై పోటీచేసి ఓటమిపాలయ్యాడు.
బీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీలో చేరిన ఆరూరి రమేశ్ వరంగల్ నుంచి బరిలోకి దిగి ఓటమి పాలయ్యాడు, బీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న దానం నాగేందర్ సికింద్రాబాద్ స్థానం నుంచి పోటీచేసి ఓటమి చెందాడు. చేవెళ్ల బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎంపీ రంజిత్‌రెడ్డి ఈసారి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి అదే స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయాడు. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరఫున నాగర్‌కర్నూల్ నుంచి ఎన్నికైన రాములు ఈ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు.
ఈసారి తన కుమారుడు భరత్ ప్రసాద్ ను అదే స్థానం నుంచి బీజేపీ తరఫున బరిలో నిలిపినా ఓటమి తప్పలేదు. ఎన్నికలకు ముందు బీఎస్పీ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరి నాగర్‌కర్నూల్ నుంచి పోటీచేసిన ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన రంగారెడ్డి జెడ్పీ చైర్‌పర్సన్ సునీతా మహేందర్‌రెడ్డి మల్కాజిగిరి నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యారు.
కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన గోమాస శ్రీనివాస్ పెద్దపల్లి నుంచి పోటీచేసి ఓటమి చెందారు. బీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీ తరపున మహబూబాబాద్ స్థానం నుంచి పోటీచేసిన సీతారాంనాయక్ ఓడిపోయారు.