టీటీడీ చైర్మన్ ఔట్

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్‌ పదవికి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత భూమన కరుణాకరరెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామాను ఆమోదించమంటూ టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డికి భూమన లేఖ రాశారు. గత ఆగస్టులో భూమన టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు.

ఈ ఎన్నికల్లో తిరుపతి నుండి పోటీ చేసిన భూమన కుమారుడు అభినయ్ రెడ్డి ఓటమి పాలయ్యాడు. ఆయన తిరుపతి నుంచి పోటీ చేశారు కానీ జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు చేతిలో ఓడిపోయారు. కుమారుడి విజ‌యం కోసం భూమన కష్టపడ్డా ఫలితం లేకపోయింది. టీడీపీ కూటమి సునామీకి దాదాపు మంత్రులందరూ ఓటమి పాలయ్యారు. దీంతో అధికార‌ వైసీపీ సింగిల్ డిజిట్‌కే పరిమితం కావ‌ల‌సి వ‌చ్చింది.

దివంగత నేత  వైఎస్ హయాంలో 2004-2006 వరకు తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ (తుడా) చైర్మన్‌గా పని చేసిన భూమన 2006 నుంచి 2008 వరకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా వ్యవహరించాడు. 2019లో తిరుపతి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఈసారి తన కుమారుడిని బరిలో దింపాడు.