గవర్నర్ కు జగన్ రాజీనామా లేఖ!

ఏపీలో ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించే దిశగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మధ్యాహ్నం ఒంటి గంట వరకు వెలువడిన ఫలితాల ప్రకారం కూటమి 156 స్థానాల్లో ముందంజలో ఉండగా వైసీపీ 19 స్థానాల్లోనే లీడ్ లో ఉంది. వైసీపీ ఓటమి ఖరారైన నేపథ్యంలో సీఎం జగన్ రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ అపాయింట్మెంట్ ను జగన్ కోరారు. మరికాసేపట్లో, రాజ్ భవన్ కు సీఎం జగన్ చేరుకోబోతున్నారని తెలుస్తోంది. గవర్నర్ కు తన రాజీనామా లేఖను జగన్ సమర్పించబోతున్నారు.

మరోవైపు, ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కరకట్టతో పాటు చంద్రబాబు నివాసం, టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. జూన్ 9న అమరావతిలో చంద్రబాబు మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ క్రమంలోనే చంద్రబాబు కోసం పోలీసులు కాన్వాయ్ ని కూడా సిద్ధం చేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది.

మ్యాజిక్ ఫిగర్ దాటిన తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంయుక్త ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఫలితాలపై స్పందనను తెలియజేయబోతున్నారని తెలుస్తోంది.