ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభంజనం సృష్టించే దిశగా అడుగులు వేస్తోంది. ఉదయం 10:30 వరకు వెలువడిన ఫలితాలను బట్టి ఎన్డీఏ కూటమి మొత్తంగా 145 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతోంది. అదే సమయంలో అధికార పార్టీ వైసీపీ కేవలం 24 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. 145 స్థానాల్లో టీడీపీ 122, జనసేన 18, బీజేపీ 5 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే విజయవాడలోని టీడీపీ కార్యాలయం వద్ద టీడీపీ శ్రేణులు బాణసంచా కాల్చి విజయోత్సవ సంబరాలు మొదలుబెట్టాయి.
ఇక, గుడివాడ, గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. దీంతో, గుడివాడ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని, గన్నవరం వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీలు కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. 5 రౌండ్లు పూర్తయ్యేసరికి టీడీపీ అభ్యర్థులు ఆ రెండు నియోజకవర్గాలలో లీడ్ లో ఉండడంతో తమ ఓటమి ఖాయమని భావించే వారిద్దరూ కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్లిపోయారని ప్రచారం జరుగుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates