బాబు.. పవన్.. లోకేశ్.. బాలయ్య.. అందరూ ముందుకే

తొలి గంట గడిచింది. హోరాహోరీగా సాగిన ఏపీ ఎన్నికల విషయానికి వస్తే.. ఓట్ల లెక్కింపు మొదలైన మొదటి గంట పూర్తి అయ్యే నాటికి ఫలితాల తీరు ఎలా ఉంటుందన్న దానిపై ఒక అవగాహన వచ్చినట్లుగా చెప్పాలి. మొదటి గంటలో ఏపీ అధికారపక్షం.. అప్పటివరకు వెల్లడైన అధిక్యతల్లో ఏ ఒక్క స్థానంలోనూ ముందుకు లేకపోవటం గమనార్హం. అదే సమయంలో విపక్ష టీడీపీ.. జనసేన.. బీజేపీలు ముందంజలో ఉన్నాయి. ఇదే తీరు.. ఏపీ లోక్ సభ స్థానాల విషయంలోనూ కనిపిస్తోంది. టీడీపీ.. జనసేన.. బీజేపీలు ముందంజలో ఉండగా.. వైసీపీ ఒక్క స్థానంలోనూ అధిక్యతను ప్రదర్శించని పరిస్థితి.

ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు తీవ్రమైన ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నట్లుగా కొన్ని కథనాలు వెలువడ్డాయి. అయితే.. ఎగ్జిట్ పోల్స్ లో మాత్రం చంద్రబాబు.. పవన్ కల్యాణ్ లకు మంచి మెజార్టీ ఖాయమని చెప్పటం తెలిసిందే. చంద్రబాబు కుమారుడు లోకేశ్ సైతం ఈసారి గెలుపు ఖాయమని అంచనాలు వ్యక్తమయ్యాయి.

అందుకు తగ్గట్లే.. తాజాగా వెల్లడవుతున్న ఫలితాలు అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కౌంటింగ్ మొదలైన మొదటి గంట గడిచేసరికి.. చంద్రబాబు.. పవన్ కల్యాణ్.. లోకేశ్ తో పాటు.. టీడీపీకి చెందిన పలువురు ప్రముఖులు.. బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా అధిక్యతలో నిలిచారు. షాకింగ్ అంశం ఏమంటే.. ఏపీ మంత్రులు ఎవరూ కూడా ఇప్పటివరకు అధిక్యతలో లేరు. వారు తిరుగమనంలో ఉన్నట్లుగా చెబుతున్నారు. దీనికి తోడు అధికార వైసీపీ ఇప్పటివరకు అధిక్యతకు సంబంధించి ఒక్క స్థానంలోనూ లేకపోవటం షాకింగ్ గా మారింది.