ప్ర‌పంచ రికార్డు సృష్టించాం

దేశంలో జ‌రిగిన 18వ లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ప్ర‌పంచ రికార్డు సృష్టించిన ట్టు కేంద్ర ఎన్నిక‌ల సంఘం పేర్కొం ది. ప్ర‌పంచంలోని ప్ర‌జాస్వామ్య దేశాల్లో ఒక్క భార‌త్‌లోనే క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో.. 64.2 కోట్ల మంది ప్ర‌జ లు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్న‌ట్టు కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ రాజీవ్ కుమార్ తెలిపారు. తాజాగా ఏడు ద‌శ‌ల ఎన్నిక‌లు పూర్తి కావ‌డం.. మ‌రికొన్ని గంట‌ల్లోనే ఫ‌లితం వెల్ల‌డి కానున్న నేప‌థ్యంలో రాజీవ్ కుమార్ మీడియాతో మాట్లాడారు.

ప్రపంచంలోనే భార‌త‌దేశంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశ‌మ‌ని పేర్కొన్నారు. ఈ క్ర‌మంలో పోలింగ్‌ను నిర్వ‌హించ‌డం అతి పెద్ద స‌వాలుగా ఆయ‌న పేర్కొన్నారు. చిన్న పాటి ఘ‌ట‌న‌లు మిన‌హా.. మిగిలిన ప్ర‌క్రియ అంతా కూడా స‌జావుగా సాగింద‌ని చెప్పారు. 64.2 కోట్ల మంది ఓటు వేయడంతో ఇది ప్ర‌పంచ రికార్డుగా మారింద‌ని తెలిపారు. ఇంత మంది ఓటేయ‌డం అనేది ఇప్ప‌టి వ‌ర‌కు ఏదేశంలోనూ జ‌ర‌గ‌లే ద‌న్నారు. ఇది గ్రూప్‌-7 దేశ‌ల మొత్తం ఓటర్ల కంటే కూడా.. 1.5 రెట్లు ఎక్కువ‌గా ఉంద‌ని పేర్కొన్నారు.

ముఖ్యంగా మ‌హిళ‌లు దేశ‌వ్యాప్తంగా 31 కోట్ల మంది త‌మ హ‌క్కును వినియోగించుకున్న‌ట్టు చెప్పారు. అదేవిధంగా 1.5 కోట్ల మంది పోలింగ్‌, సెక్యూరిటీ సిబ్బంది ప‌నిచేసిన‌ట్టు చెప్పారు. దేశ‌వ్యాప్తంగా వివిధ కార‌ణాల‌తో 39 చోట్ల రీపోలింగ్ నిర్వ‌హించిన‌ట్టు రాజీవ్ కుమార్ వెల్ల‌డించారు. ముఖ్యంగా హిమ ప్రాంతమైన జ‌మ్ము క‌శ్మీర్‌లో పోలింగ్ ప్ర‌క్రియ‌ను ప్ర‌శాంతంగా నిర్వ‌హించిన‌ట్టు చెప్పారు. ఒక్క కశ్మీర్‌ లోయలో 51.05శాతం పోలింగ్‌ నమోదైంద‌ని రాజీవ్ కుమార్ వెల్ల‌డించారు.

ధ‌న ప్ర‌వాహాన్ని ఆపాం!

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో న‌గదు ర‌వాణాను సాధ్య‌మైనంత వ‌ర‌కు నిలువ‌రించిన‌ట్టు రాజీవ్ కుమార్ చెప్పారు. అయిన‌ప్ప‌టికీ… 10 వేల కోట్ల విలువైన బంగారం.. డ్ర‌గ్స్‌, ఇత‌ర సామ‌గ్రిని ప‌ట్టుకున్న‌ట్టుచెప్పారు. మంగ‌ళ‌వారం దేశ‌వ్యాప్తంగా 144 సెక్ష‌న్ విధించిన‌ట్టు తెలిపారు ఫ‌లితాలు వ‌చ్చాక సంబ‌రాలు చేసుకునేందుకు అవ‌కాశం లేద‌ని.. కోడ్ ముగిసే వ‌ర‌కు ఎవ‌రూ ఇలాంటి ప‌నులు చేయ‌రాద‌ని తెలిపారు. అయితే.. ఏపీలో జ‌రిగిన అల్ల‌ర్ల‌పై మాట్లాడేందుకు రాజీవ్ కుమార్ నిరాక‌రించారు. అక్క‌డి అధికారులు చూసుకుంటార‌ని తెలిపారు.