2014 రికార్డు రిపీట్ చేయ‌నున్న చంద్ర‌బాబు!: ఎగ్జిట్ పోల్‌

రాజ‌కీయాల్లో ఏమైనా జ‌ర‌గొచ్చు. ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకోవ‌డం.. అంత శుల‌భం కాదు. వారి ఆలోచ‌నా దోర‌ణి ఎలా ఉంటుంద‌నేది ఫ‌లితం వ‌చ్చాకే స్ప‌ష్ట‌మ‌వుతుంది. అయితే.. తాజాగా వ‌చ్చిన మ‌రో ఎగ్జిట్ పోల్ స‌ర్వేలో ఆస‌క్తిక‌ర విష‌యం వెలుగు చూసింది. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ 2014లో సాధించిన రికార్డును, అదేస‌మ‌యంలో ఆ ఏడాది టీటీడీ సాధించిన రికార్డును ఇప్పుడు చంద్ర‌బా బు రిపీట్ చేయ‌నున్న‌ట్టు ఇండియా టుడే-మై యాక్సిస్ ఎగ్జిట్ పోల్ పేర్కొంది. వాస్త‌వానికి అన్ని పోల్ స‌ర్వేలు.. శ‌నివార‌మే వెల్ల‌డిస్తే.. ఇండియా టుడే-మై యాక్సిస్ ఎగ్జిట్ పోల్ మాత్రం ఆదివారం వెల్ల‌డైంది. పూర్తి వివ‌రాలు వెల్ల‌డించింది.

ఇండియా టుడే-మై యాక్సిస్ ఎగ్జిట్ పోల్ వివ‌రాలు చెప్పుకొనే ముందు.. 2014లో ఏం జ‌రిగిందో చూద్దాం. అప్ప‌ట్లో బీజేపీ ప్ర‌ధా ని అబ్య‌ర్థిగా మోడీ రంగంలో ఉన్నారు. తొలిసారి ఆయ‌న పార్ల‌మెంటుకు పోటీ చేశారు. ఈ స‌మ‌యంలో వివిధ పార్టీల‌తో పొత్తులు పెట్టుకుని ఎన్నిక‌ల‌కు వెళ్లారు. పెద్ద ఎత్తున ప్ర‌చారం చేశారు. చాయ్ పే చ‌ర్చ‌ అంటూ.. వినూత్న కార్య‌క్ర‌మాల‌కు కూడా శ్రీకారం చుట్టారు. మొత్తంగా ఏపీలో టీడీపీ, జ‌న‌సేన‌ల‌తోనూ పొత్తు పెట్టుకున్నారు. ఇలా.. ఆయ‌న దేశ‌వ్యాప్తంగా క‌లిసి వ‌చ్చిన అన్ని పార్టీల‌తోనూ అడుగులు ముందుకు వేశారు. చిత్రంగా.. ఆనాటి ఫ‌లితాల్లో బీజేపీ ఒక్క‌దానికే 282 సీట్లు వ‌చ్చాయి. ఇది మేజిక్ ఫిగ‌ర్ 272 కంటే 10 స్థానాలు ఎక్కువే.

అంటే.. పొత్తు పెట్టుకుని అధికారంలోకి రావాల‌ని అనుకున్న మోడీకి ప్ర‌జ‌లు ఒంట‌రిగానే అధికారాన్ని అప్ప‌గించారు. క‌ట్ చేస్తే.. ఇప్పుడు ఏపీలోనూ ఇదే ప‌రిస్థితి ఉంటుంద‌ని ఇండియా టుడే-మై యాక్సిస్ ఎగ్జిట్ పోల్ పేర్కొంది. తాజాగా ఈ సంస్థ అందించిన లెక్క‌ల ప్ర‌కారం.. ఏపీలో టీడీపీ మొత్తం 144 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసింది. మిత్ర‌ప‌క్షాలైన జ‌న‌సేన‌కు 21, బీజేపీకి 10 స్థానాలు కేటాయించింది. ఈ మూడు పార్టీలు క‌లిసి.. మేజిక్ ఫిగ‌ర్ 88(175లో స‌గం కంటే 1 ఎక్కువ‌) అయినా.. రాక‌పోతాయా? అని చంద్ర‌బాబు లెక్క‌లు వేసుకున్నారు. అయితే.. తాజాగా ఇండియా టుడే-మై యాక్సిస్ ఎగ్జిట్ పోల్ వెల్ల‌డించిన లెక్క‌ల ప్ర‌కారం.. చంద్ర‌బాబు ఒంట‌రిగానే 78 నుంచి 96 స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకుంటున్న‌ట్టు తెలిపింది.

ఈ లెక్క నిజ‌మైతే..(మంగ‌ళ‌వారం తెలుస్తుంది) వాస్త‌వానికి మేజిక్ ఫిగ‌ర్ 88 కాబ‌ట్టి.. అంత‌కు మించి.. మ‌రో 8 సీట్లు ఎక్కువ‌గా నే చంద్ర‌బాబుకు ఒంట‌రిగా వ‌స్తున్నాయి. అంటే.. మిత్ర‌ప‌క్షాల‌తోనూ ప‌నిలేదు. అయినప్ప‌టికీ.. వాటిని వ‌దులు కోరు కానీ.. లెక్క మాత్రం ఆయ‌న‌కు స‌రిపోతుంది. చిత్రం ఏంటంటే 2014లోనూ బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ 102 స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకుంది. పొత్తులో ఉన్న బీజేపీకి 12 స్థానాలు కేటాయించ‌గా 4 చోట్ల విజ‌యం ద‌క్కించుకున్నారు. అంటే..అప్ప‌ట్లోనూ టీడీపీకి సొంత‌గానే మెజారిటీ వ‌చ్చింది. ఇక‌, ఇప్పుడుకూడా అదే రిపీట్ అవుతుంద‌న్న‌ది స‌ర్వే అంచ‌నా.

ఇండియా టుడే-మై యాక్సిస్ ఎగ్జిట్ పోల్ లెక్క ఇదీ..
(అసెంబ్లీ 175 సీట్ల‌లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు)
టీడీపీ : 78 – 96
జనసేన : 16 -18
బీజేపీ : 4 – 6
వైసీపీ : 55 – 77
కాంగ్రెస్ : 0-2