విజ‌యం మ‌న‌దే: చంద్ర‌బాబు హ‌ర్షం

మ‌రికొన్ని గంటల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానున్న నేప‌థ్యంలో టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. కూట‌మి పార్టీల ముఖ్య నాయ‌కుల‌తో చంద్ర‌బాబు మాట్లాడుతూ.. విజ‌యం మ‌న‌దే అని హ‌ర్షాతిరేకాలు వ్య‌క్తం చేశారు.

ఆదివారం .. ఉండ‌వ‌ల్లిలోని త‌న నివాసం నుంచి వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించిన చంద్ర‌బాబు.. కూట‌మి పార్టీలైన‌.. జ‌న‌సేన‌, బీజేపీ నేత‌లతో ఆయ‌న మాట్లాడారు.

ఈ కాన్ఫ‌రెన్స్‌లో బీజేపీరాష్ట్ర చీఫ్ పురందేశ్వ‌రి, జ‌న‌సేన పీఏసీ చైర్మ‌న్‌… నాదెండ్ల మ‌నోహ‌ర్, టీడీపీ ముఖ్య నాయ‌కులు కూడా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ.. కూట‌మి విజయం త‌థ్య‌మ‌ని పేర్కొన్నారు.

మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ కూట‌మి ఘ‌న విజ‌యం సాధిస్తుంద‌ని చెప్పాయ‌ని.. ఇదే నిజం అవుతుంద‌ని తెలిపారు. ప్ర‌తిఒక్క‌రూ మ‌రింత అప్ర‌మ‌త్తంగాఉండాల‌ని ఆయ‌న సూచించారు. వైసీపీ నాయ‌కులు.. ఓట‌మిని జీర్ణించుకునే ప‌రిస్థితిలో లేర‌ని తెలిపారు.

ఎన్నిక‌ల కౌంటింగ్ సంద‌ర్భంగా వారు ఎలాంటి అల‌జ‌డినైనా సృష్టించి కౌంటింగ్ ప్ర‌క్రియ‌కు విఘాతం క‌లిగించేందుకు ప్రయ‌త్నించేలా ప‌న్నాగాలు ప‌న్నుతున్న‌ట్టు త‌న‌కు స‌మాచారం ఉంద‌న్నారు.

కాబ‌ట్టి కూట‌మి పార్టీల నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు.. అంద‌రూ స‌మ‌న్వ‌యంతో ముందుకుసాగి.. కౌంటింగ్ రోజు వైసీపీ అక్ర‌మాల‌ను అడ్డుకోవాల‌ని సూచించారు. ఎన్నిక‌ల‌ప్ర‌చారం నుంచి పోలింగ్ డే వ‌ర‌కు ఎంత స‌మ‌న్వ‌యంతో ముందుకు సాగారో.. అంతే స‌మ‌న్వ‌యంతో ఉండాల‌ని కోరారు.