పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయాడు.. రాష్ట్రమంతటా పోటీ చేస్తే ఆయన పార్టీ గెలిచింది ఒక్క సీటు.. ఆ ఎమ్మెల్యేను కూడా నిలబెట్టుకోలేకపోయాడు.. రాజకీయాల పట్ల సీరియస్‌నెస్ లేడు.. సొంత బలం మీద నమ్మకం లేక పొత్తు కోసం వెంపర్లాడతాడు.. బలానికి తగ్గట్లు సీట్లు ఇప్పించుకోలేడు.. ప్యాకేజీ తీసుకుని టీడీపీ కోసం పని చేస్తాడు.. ఇలా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యర్థులు చేసే విమర్శలు, ఆరోపణలు ఎన్నెన్నో.
ఇవన్నీ ఒకెత్తయితే.. పవన్ వ్యక్తిగత జీవితం గురించి పదే పదే ప్రస్తావిస్తూ చేసే జుగుప్సాకరమైన వ్యాఖ్యలు మరో ఎత్తు. ఇవన్నింటినీ ఓపిగ్గా భరిస్తూ వచ్చిన పవన్.. వైఎస్సార్ కాంగ్రెస్ ఓటమే ధ్యేయంగా ఎంత కష్టపడ్డాడో, ఎన్ని త్యాగాలు చేశాడో అందరికీ తెలుసు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తు సాధ్యపడడంలో పవన్‌దే అత్యంత కీలక పాత్ర అనడంలో మరో మాట లేదు.
తెలుగుదేశం-జనసేన ఉమ్మడి సభలో మాట్లాడుతూ.,. జగన్ నిన్ను అథ:పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు అని ఆవేశంగా శపథం చేసినపుడు చాలామంది దాన్ని కామెడీగా తీసుకున్నారు. వైసీపీ వాళ్లు ఎగతాళి చేశారు. కట్ చేస్తే ఇప్పుడు ప్రధాన సర్వే సంస్థలన్నీ కూటమిదే ఘనవిజయం అని చాటి చెబుతున్నాయి. వైసీపీ ఓటమి ఖాయం అని తేల్చేశాయి.
ఇక ఫలితాలు ఇదే రకంగా రావడం లాంఛనమే అని భావిస్తున్నారు. ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని చెప్పిన ఆరా మస్తాన్ సైతం పిఠాపురంలో పవన్ ఘనవిజయం సాధిస్తున్నారని.. జనసేన తాను పోటీ చేసిన వాటిలో మెజారిటీ సీట్లు గెలవబోతోందని.. ఆ పార్టీ అభ్యర్థులు పోటీ చేసిన రెండు ఎంపీ స్థానాలు కూడా సొంతం చేుసుకోబోతోందని తేల్చేశారు.
దీన్ని బట్టి ఈ ఎన్నికల్లో జనసేన, పవన్ కళ్యాణ్ ప్రభావం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. దీంతో ఫలితాలు రావడానికి ముందే పవన్‌ను అందరూ కొనియాడుతున్నారు. అందులో టీడీపీ వాళ్లు కూడా ఉన్నారు. పవన్ పవరేంటో ఇప్పుడే అందరికీ తెలుస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates