మాజీ ఎంపీ.. రాజకీయ విశ్లేషకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే.. ఆయన ఈ సంబరాలను ఉద్దేశించి.. కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం. “ఒకవైపు ఏపీ ఏడుస్తోంది.. మరో వైపు తెలంగాణలో సంబరాలు చేసుకుంటున్నారు” అని చెప్పారు.. 2014, జూన్ రెండు నుంచి తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరుగుతున్న విషయం తెలిసిందే.
అప్పట్లో రాష్ట్రాన్ని ఇచ్చామని చెప్పుకొన్న కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘంగా పదేళ్ల విరామం తర్వాత.. తెలంగాణ లో అధికారంలోకి వచ్చింది. దీంతో ఈ సంబరాలను సహజంగానే ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక, ఏపీలో ఉన్న ప్రభుత్వం ఆది నుంచి కూడా.. జూన్ 2కు ప్రాధాన్యం ఇవ్వలేదు. చంద్రబాబు హయాంలో ప్రతిజ్ఞ చేయించేవారు. రాష్ట్రం అభివృద్ధి కి కట్టుబడతామని అందరినతోనూ చెప్పించేవారు. కానీ, వైసీపీ హయాం లో మాత్రం అది కూడా లేకుండా పోయింది.
అయితే.. తాజాగా ఈ విషయాన్ని ప్రస్తావించిన ఉండవల్లి అరుణ్ కుమార్… తెలంగాణలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా చేసుకుంటున్నారని తెలిపారు. కానీ, ఏపీలో మాత్రం గత పదేళ్లుగా ఏడుస్తూనే ఉన్నారని చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను చంద్రబాబు ప్రభుత్వం కానీ.. జగన్ ప్రభు త్వం కానీ… పరిష్కరించేందుకు ప్రయత్నం చేయలేదన్నారు ఎవరికి వారు తమ రాజకీయ ప్రయోజనాల కు మాత్రమే పరిమితమయ్యారని.. తద్వారా రాష్ట్రం ఇంకా సమస్యల్లోనే ఉందని చెప్పారు.
ముఖ్యంగా పోలవరం పరిస్థితి దారుణంగా ఉందన్నారు. తెలంగాణలో ఉన్న ఆస్తులను రప్పించే ప్రయ త్నం తక్షణమే చేయాలని ఉండవల్లి సూచించారు. ఏపీ ఆస్తులపై కూడా..అద్యయనం చేయాలని… నీటి వాటాలు ఎప్పటికీ తెగేలా లేవని వ్యాఖ్యానించారు. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా గత పదేళ్లుగా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేదు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి బాలేదు
అని అన్నారు. ఇదేసమయంలో తెలంగాణతో ఏపీ ముఖ్యమంత్రులు పోరాడలేక పోవడానికికారణం.. వ్యాపార ప్రయోజనాలు కూడా ఉన్నాయని చెప్పారు.
మాజీ సీఎం చంద్రబాబు, ప్రస్తుత సీఎం జగన్‌లకు హైదరాబాద్‌లో వ్యాపారాలు ఉన్నాయని..తెలంగాణ ప్రభుత్వాన్ని ఏ కొంచెం సీరియస్గా ప్రశ్నించినా.. వారి వ్యాపారాలకు ఇబ్బందులు వస్తాయనే భయం ఉందని అందుకే వారు మౌనంగా ఉంటున్నారని ఉండవల్లి విమర్శించారు. కనీసం పది సంవత్సరాల తర్వాతైనా.. ఏపీని కాపాడుకునేందుకు స్వప్రయోజనాలు.. వ్యాపార ప్రయోజనాలను పక్కన పెట్టి ప్రయత్నించాలని ఉండవల్లి సూచించారు.