తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలో పరాజయం పాలయింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని దిగిన ఈ పోటీలో కాంగ్రెస్ పార్టీని విజయం వరించలేదు. గత శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కల్వకుర్తి శాసనసభ్యుడిగా ఎన్నిక కావడంతో మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి ఉప ఎన్నిక అనివార్యమయింది.
దీంతో ఎన్నికల కమీషన్ మార్చి 28న ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించింది. రాష్ట్రంలో అధికార మార్పిడి అనంతరం జరిగిన ఎమ్మెల్సీ ఉపఎన్నికను బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ తరపున ప్రముఖ పారిశ్రామికవేత్త జీవన్ రెడ్డిని ఎన్నికల బరిలో దించింది. బీఆర్ఎస్ తరపున మాజీ ఉమ్మడి జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ నవీన్ కుమార్ రెడ్డిని బరిలోకి దింపింది. అయితే ఈ ఎన్నిక ఫలితాలు లోక్ సభ ఎన్నికల మీద ప్రభావం చూపుతాయని లెక్కింపును ఈసీ నేటికి వాయిదా వేసింది.
ఈ రోజు జరిగిన ఓట్ల లెక్కింపులో బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిపై 111 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ రెడ్డి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో మొత్తం 1,437 ఓట్లు పోల్ కాగా 21 ఓట్లు చెల్లనివిగా అధికారులు నిర్ధారించారు. బీఆర్ఎస్ కు 763 ఓట్లురాగా, కాంగ్రెస్ కు 652 ఓట్లు పోలయ్యాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates