ఔర్ ఏక‌బార్ ఓకే.. ‘చార్ సౌ’ పార‌లేదు!!

కేంద్రంలో ఎవ‌రు అధికారంలోకి వ‌స్తారు? ఎవ‌రు ఢిల్లీ గ‌ద్దెనెక్కుతారు? అనే విష‌యం కూడా ఈ సారి ఉత్కంఠ‌కు గురిచేసింది. అధికార పార్టీ బీజేపీ, ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్‌లు ఈ ద‌ఫా కూడా కూట‌మిగానే ముందుకు వ‌చ్చాయి. అంతేకాదు.. ప్ర‌చారాన్ని ప‌రుగు లు పెట్టించాయి. దీనిలో ప్ర‌ధానంగాపీఎం మోడీ ప‌రివారం అంతా కూడా.. “ఔర్ ఏక్‌బార్‌-4 సౌ.. పార్‌!” నినాదం వినిపించింది. క‌శ్మీర్ నుంచి క‌న్యాకుమారి వ‌ర‌కు కూడా.. ఈ కూట‌మి ఇదే నినాదంతో ముందుకు వెళ్లింది. ఇక‌, కాంగ్రెస్ కూడా.. త‌మ‌కు 300 సీట్లు ఖాయ‌మ‌ని తెలిపింది.

ప్ర‌చారం ముగిసింది.. ఎన్నిక‌లు కూడా ముగిశాయి. ఇక‌, ఫ‌లితం మాత్ర‌మే మిగిలి ఉంది. అయితే.. ఈ మ‌ధ్య గ్యాప్‌లో ఎగ్జిట్ పోల్ ఫ‌లితం వ‌చ్చింది. ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకున్న అనేక సంస్థ‌లు.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వ‌స్తాయ‌నే విష‌యం వెల్ల‌డించింది. దీని ప్ర‌కారం.. ఏ సంస్థను చూసుకున్నా.. ఒక్క‌టే మాట వినిపించింది.. ఒక్క‌టే ఫ‌లితం క‌నిపించింది. కేంద్రంలో మ‌రోసారి కూడా మోడీదే అధికారం. దీనిలో తిరుగులేదు. అని తేల్చి చెప్పాయి. జాతీయ‌స్థాయి అన్ని స‌ర్వేలు కూడా.. ఇదే విష‌యాన్ని తేల్చి చెప్పాయి. ఇక‌, ఇదే స‌మ‌యంలో వారు చెప్పిన చార్ సౌ పార్‌ అనే విష‌యాన్ని మాత్రం ప‌క్క‌న పెట్టాయి.

325-370 మ‌ధ్య మాత్ర‌మే.. న‌రేంద్ర మోడీ కూట‌మి సీట్లు ద‌క్కించుకుంటుంద‌ని స‌ర్వే సంస్థ‌లు పేర్కొన్నాయి. అంటే.. కూట‌మి ప‌క్షాలు ప్ర‌చారం చేసుకున్న‌ట్టుగా ఎక్క‌డా వారు 543 సీట్ల‌లో 400 సీట్లు అయితే ద‌క్కించుకోవ‌డం లేదు. కానీ, గెలుపు గుర్రం మాత్రం ఎక్కుతున్నారు. 400 సీట్లు రాక‌పోయినా.. మూడో సారి అధికారంలోకి వ‌స్తున్నార‌న్న అంచ‌నా నిజ‌మైతే.. బీజేపీకి తిరుగులేని విజ‌యం ద‌క్కిన‌ట్టే అవుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు కాంగ్రెస్ మాత్ర‌మే ఈ దేశంలో మూడు సార్లు వ‌రుస‌గా అధికారంలోకి వ‌చ్చింది. అది కూడా.. 1970ల‌కు ముందు. ఆ రికార్డును మోడీ ఇప్పుడు స‌మం చేయ‌నున్నారు.

మ‌రోవైపు అనేక పార్టీలతో జ‌త‌కట్టి .. వాటితో వేగ‌లేక‌పోయినా.. ఏదో ఒక విధంగా ముందుకు సాగిన కాంగ్రెస్ పార్టీ.. ఈ ద‌ఫా 110-190 మ‌ధ్య మాత్ర‌మే మిగిలిపోతుంద‌ని చెబుతున్నారు. దీనిలో నూ త‌గ్గేవే ఎక్కువ‌గా ఉన్నాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. మొత్తంగా చూస్తే.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చే ప‌రిస్థితి మాత్రం క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు. ఈ ప్ర‌భావం రాహుల్ గాంధీ నాయ‌క‌త్వంపైనే ఎక్కువ‌గా క‌నిపించ‌నుంది. ఇక‌, కూట‌మి పార్టీలు కూడా.. కాంగ్రెస్‌కు స‌హ‌క‌రించింది లేద‌నే విష‌యం బ‌హిరంగ ర‌హ‌స్యం. ప‌శ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా ఇవ్వని మ‌మ‌త‌, ఢిల్లీలో ఆది నుంచి వివాదాల‌తోనే ముందుకు సాగిన ఆప్ వంటివి కూట‌మికి సెగ పెట్టాయి.