తెలంగాణ‌ చిహ్నంపై రాజ‌కీయ చిందులు!

తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం మూడు ప్ర‌ధాన అంశాల‌ను జూన్ 2న ఆవిష్క‌రించ‌నుంది. రాష్ట్ర ఆవిర్భా వ దినోత్స‌వాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం ఆ రోజును ఘ‌నంగా చేయాల‌ని నిర్ణ‌యించారు. దీనిలో భాగంగా ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న తెలంగాణ త‌ల్లి విగ్ర‌హంతో మార్పులు చేయించారు. దీనిని ఆ రోజు ఆవిష్క‌రించ‌నున్నారు. అదేవిధంగా తెలంగాణ జాతీయ గీతం పేరుతో కొత్త గీతాన్ని రూపొందించారు. ఇక‌, తెలంగాణ అధికార ముద్ర‌(చిహ్నం)ను కూడా మార్పు చేశారు.

అయితే.. తెలంగాణ కొత్త గీతం, కొత్త అధికార ముద్ర‌పై.. రాజ‌కీయాలు ముసురుకున్నాయి. గీతం విష‌యం లో ఆంధ్రాకు చెందిన సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం. కీర‌వాణికి సంగీతం రూపొందించే బాధ్య‌త‌లు ఇవ్వ‌డం ఏంట‌ని.. తెలంగాణ ప్రాంతానికి చెందిన సంగీత క‌ళాకారుల సంఘం ఇప్ప‌టికే ఆక్షేపించింది. ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని తీవ్రంగా త‌ప్పుబ‌ట్టింది. తెలంగాణ‌లో అనేక మంది ల‌బ్ధ ప్ర‌తిష్టులైన క‌ళాకారులు ఉన్నార‌ని.. వారిని విస్మ‌రించి.. ఆంధ్రాకు చెందిన సంగీత ద‌ర్శ‌కుడికి ఎలా బాధ్య‌త ఇస్తార‌ని కూడా ప్ర‌శ్నించింది.

అయితే.. ఈ వాద‌న‌ను సీఎం రేవంత్ రెడ్డి తోసిపుచ్చిన విష‌యం తెలిసిందే. క‌వి అందెశ్రీకి ఈ గీతాన్ని రూపొందించే బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించామ‌ని.. ఆయ‌న క‌నుస‌న్న‌ల్లోనే ఈ గీతం రూపొందింద‌ని.. ఆయ‌న ఎవ‌రికి సంగీత బాధ్య‌త‌లు అప్ప‌గించారో.. ఆయ‌న ఇష్ట‌మ‌ని ప్ర‌భుత్వానికి సంబంధం లేద‌ని చెప్పారు. ఇలా ఆ వివాదం నుంచి బ‌య‌ట ప‌డ్డారు. కానీ, ఇప్పుడు అధికారిక చిహ్నంపై ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్ తీవ్రంగా స్పందించింది. అధికారిక చిహ్నంలో తెలంగాణ సంస్కృతి, సంప్ర‌దాయాలు, ప్ర‌గ‌తిని విస్మ‌రించార‌ని పార్టీ ముఖ్య నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్ దుయ్య‌బ‌ట్టారు.

తెలంగాణ అధికార చిహ్నంలో హైద‌రాబాద్ నగర ప్రగతి కనిపించకుండా ప్రభుత్వం నాశ‌నం చేసింద‌ని విమ‌ర్శించారు. తాజాగా ఆయ‌న చార్మినార్‌ వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. ‘‘కేసీఆర్‌ పేరు కనిపించ కుండా చేయాల‌నే కుట్ర చేస్తున్నారు. అందుకే మూర్ఖపు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మార్పుల వెనుక రాజకీయ కక్ష స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. రాష్ట్ర చిహ్నంలో చార్మినార్‌ను తొలగించడం హైదరాబాదీలను విస్మరించడమే“ అని కేటీఆర్ విమ‌ర్శ‌లు గుప్పించారు.

హైదరాబాద్ కు మ‌రింత గుర్తింపు తెచ్చిన చార్మినార్‌ ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిందనికేటీఆర్ చెప్పారు. ఇలాంటి క‌ట్ట‌డాన్ని తెలంగాణ అధికార చిహ్నంలో తొల‌గించ‌డం దారుణ‌మని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొనలేదని చెప్పారు. అధికార చిహ్నంలో చేసిన మార్పుల‌ను స‌హించేది లేద‌ని.. రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను జాగృతం చేస్తామ‌ని తెలిపారు.