బెయిల్ ఎఫెక్ట్.. టంగ్ మార్చేసిన ఢిల్లీ సీఎం!

ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణంలో అరెస్ట‌యి జైల్లో రెండు మాసాల‌కు పైగా గ‌డిపిన ఢిల్లీ ముఖ్య‌మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అర‌వింద్ కేజ్రీవాల్.. పార్ల‌మెంటు ఎన్నిక‌ల నేప‌థ్యంలో త‌న పార్టీ ప్ర‌చారం కోసం.. సుప్రీంకోర్టును ఆశ్ర‌యించి బెయిల్ పొందారు. దీంతో గ‌త వారం నుంచి కూడా ఆయ‌న ఎన్నిక‌ల ప్ర‌చారం చేశారు. ఆరో ద‌శ ఎన్నిక‌ల పోలింగ్‌లో ఢిల్లీలోని 7 పార్ల‌మెంటు స్థానాల‌కు ఎన్నిక‌ల పోలింగ్ ముగిసింది. అయితే.. బెయిల్ నిబంధ‌న‌ల మేర‌కు కేజ్రీవాల్ దేశంలో ఎన్నిక‌లు ముగిసిన జూన్ 1వ తేదీ త‌ర్వాత రోజు ఆయ‌న కోర్టులో లొంగిపోయి జైలుకు వెళ్లిపోవాలి.

అయితే.. ఎన్నిక‌ల ఫ‌లితం త‌మ‌కు అనుకూలంగా వ‌స్తుంద‌ని భావిస్తున్న కేజ్రీవాల్‌.. ఈ బెయిల్‌ను పొడిగించుకునేందుకు ప్ర‌యత్నించారు. త‌నకు అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని.. కిడ్నీ స‌మ‌స్య‌లు కూడా వ‌చ్చాయ‌ని.. కాబ‌ట్టి వైద్య ప‌రీక్ష‌ల నిమిత్తం త‌నకు జూన్ 7వ తేదీ వ‌ర‌కు బెయిల్ ను పొడిగించాల‌ని ఆయ‌న కోర్టును అభ్య‌ర్థించారు. తొలుత ఈ పిటిష‌న్‌ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చ‌డంతో ఆయ‌న సుప్రీంకోర్టుకు వెళ్లారు. అయితే.. మంగ‌ళ‌వారం నాటి విచార‌ణలో ఇక్క‌డ కూడా ఆయ‌న‌కు చుక్కెదురు అయింది. ‘మీకు బెయిల్ ఇచ్చింది.. సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి కాబ‌ట్టి.. ఆయ‌న‌నే ఆశ్ర‌యించాలి’ అని ఇత‌ర న్యాయ‌మూర్తులు తేల్చి చెప్పారు.

దీంతో బుధ‌వారం కేజ్రీవాల్ సీజేఐ ద‌ర్మాసనం ముందు.. త‌న పిటిష‌న్‌ను ఉంచారు. కానీ, ఇక్క‌డ కూడా ఆయ‌నకు ఎదురు దెబ్బ త‌గిలింది. ‘మీరు రెగ్యుల‌ర్ బెయిల్ పొందాల‌ని చూస్తున్నారు. కాబ‌ట్టి ట్ర‌య‌ల్ కోర్టుకు వెళ్లండి’ అని సీజేఐ తేల్చి చెప్పారు. ఇప్ప‌టికే ట్ర‌య‌ల్ కోర్టులో ఒక‌సారి ఎదురుదెబ్బ త‌గిలిన నేప‌థ్యంలో కేజ్రీవాల్ ప‌రిస్థితి ఇర‌కాటంలో ప‌డింది. మ‌రో రెండు రోజులు మాత్ర‌మే బెయిల్ ఉండ‌డం.. ఇప్పుడు దీనిని పొడిగిస్తారో లేదో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొన్న నేప‌థ్యంలో కేజ్రీవాల్ చాలా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించారు.

సుప్రీం కోర్టు ఆదేశాలువ‌చ్చిన గంట‌లోనే ఆయ‌న ఓ ప్ర‌ముఖ ఛానెల్‌తో మాట్లాడుతూ.. తాము కాంగ్రెస్‌తో పెట్టుకున్న పొత్తుపై తీవ్ర వ్యాఖ్య‌లు చేస్తూ.. ‘అదేమీ శాశ్వ‌త బంధం కాదు’ అని తేల్చి చెప్పారు. తాము ప‌ర్మినెంట్‌గా కాంగ్రెస్‌ను వివాహం చేసుకోలేద‌ని.. అవ‌స‌రమైతే.. ఎప్పుడైనా మేం స్వ‌తంత్రంగా వ్య‌వ‌హ‌రిస్తామ‌ని చెప్పారు. త‌మ ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీని బ‌ల‌ప‌రచాల‌ని అనుకున్నామ‌ని.. కానీ.. ఇది సాధ్య‌మ‌య్యేలా క‌నిపించ‌డం లేద‌ని చెప్పారు. అందుకే పంజాబ్‌లో ఒంట‌రిగానే బ‌రిలో ఉన్నామ‌ని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. మొత్తానికి బెయిల్ ఎఫెక్ట్‌తో కేజ్రీవాల్ వ్యూహం మారింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. దీనిని బట్టి త‌న బెయిల్ కోసం.. కేసుల నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు అవ‌స‌రమైతే.. ఆయ‌న బీజేపీకి సైతం మ‌ద్ద‌తిచ్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.