ఆంధ్రప్రదేశ్ లో గత కొంతకాలంగా హిందూ ఆలయాలు, ఆచారాలు, ఆస్తులు, చారిత్రక రథాలపై జరుగుతున్న దాడులు దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. అంతర్వేది ఘటన ఇరు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. దీంతో, అంతర్వేది వ్యవహారంపై కేంద్రంలోని బీజేపీ సర్కార్ కూడా సీరియస్ గా ఉంది. దేవాలయాలపై దాడుల విషయంలో వైసీపీ వైఖరిపై ఏపీ బీజేపీ కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, సీఎం రమేశ్ లేఖ రాశారు. అంతర్వేదిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధమైన ఘటన, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో మూడు సింహాల ప్రతిమలు మాయమైన ఘటనతోపాటు పలు ఘటనలను తమ లేఖ ద్వారా అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. గత ఏడాది కాలంలో ఏపీలో ఇటువంటి ఘటనలు 18 జరిగాయని, వాటిపై కేంద్రం తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.
కోట్లాది హిందువుల సెంటిమెంట్లతో ముడిపడిన ఈ అంశాలపై దర్యాప్తునకు ఏపీ సర్కారు సరిగా స్పందించడంలేదని జీవీఎల్ ఆరోపించారు. అంతర్వేది ఘటనపై శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న 41 మంది హిందూ కార్యకర్తలు…చర్చిలపై రాళ్లు విసిరారంటూ తప్పుడు కేసులు పెట్టారన్నారు. ఏపీ ప్రభుత్వం హిందువులపై మాత్రం అణచివేత వైఖరి అవలంబిస్తోందని ఆరోపించారు. హిందూ కార్యకర్తల అరెస్ట్ ని నిరసిస్తూ ఏపీ బీజేపీ నేతలు ‘చలో అమలాపురం’ కార్యక్రమానికి పిలుపునిచ్చారని, ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నేతలను అక్రమంగా నిర్బంధించారని లేఖలో పేర్కొన్నారు. ఈ విషయంలో కేంద్రం తక్షణమే జోక్యం చేసుకుని ఏపీలో చట్టం సరిగా అమలయ్యేలా చూడాలని అమిత్ షాను కోరారు. మరి, ఈ లేఖపై ఇటు వైసీపీ సర్కార్, అటు అమిత్ షా ఏవిధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates