ఉరవకొండ ఈసారి లెక్క మారుతుందా ?

ఉరవకొండ. అన్ని నియోజకవర్గాలది ఒక ఎత్తు అయితే ఈ నియోజకవర్గానిది ఒక ఎత్తు. గత రెండు దశాబ్దాలుగా ఇక్కడ శాసనసభ ఎన్నికల ఫలితాలు అంటే అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తారు. చివరి వరకు గెలుపు ఎవరిది ? నువ్వా ? నేనా ? అన్నట్లు ఫలితాలు ఉంటాయి. అందుకే అనంతపురం జిల్లాలో ఈ నియోజకవర్గం ప్రత్యేక స్థానం.

గతంలో ఉన్న అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు ప్రతి నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు కోసం 14 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేయగా ఈ నియోజకవర్గంలో ఈ సారి లెక్కింపు కోసం 18 టేబుళ్లను ఏర్పాటు చేయడం విశేషం. ఇక్కడ మొత్తం 263 పోలింగ్ బూతులు ఉన్నాయి. 14 రౌండ్లలో 252 పోలింగ్ బూతుల కౌంటింగ్ పూర్తవుతుంది. మిగిలిన 11 బూతులను 15వ రౌండ్ లో లెక్కిస్తారు. 

ఇక్కడ టీడీపీ నుండి పయ్యావుల కేశవ్, వైసీపీ నుండి విశ్వేశ్వర్ రెడ్డిలు ఈసారి పోటీ పడుతున్నారు. 2004 ఎన్నికల నుండి వీరిద్దరే ప్రత్యర్ధులుగా ఉంటూ వస్తున్నారు. వీరికి వచ్చే ఓట్లలో విజేతగా ఎవరు నిలిచినా స్వల్ప తేడా మాత్రమే ఉండడంతో ఇద్దరూ రీ కౌంటింగ్ కోసం డిమాండ్ చేయడం, సవాళ్లు, ప్రతి సవాళ్లకు దిగడం జరుగుతుంది. అందుకే ఈసారి ఉద్రిక్తత తలెత్తకుండా, పొరపాట్లకు తావివ్వకుండా అధికారులు ప్రయత్నిస్తున్నారు.

2004 ఎన్నికల నుండి వీరిద్దరి గెలుపు ఓటములు పరిశీలిస్తే 2004 ఎన్నికల్లో పయ్యావుల కేశవ్ కు 55756 ఓట్లు రాగా, కాంగ్రెస్ నుండి పోటీ చేసిన విశ్వేశ్వర్ రెడ్డికి 47,501 ఓట్లు వచ్చాయి. కేవలం 8255 ఓట్లతో పయ్యావుల విజయం సాధించాడు. 2009 ఎన్నికలలో పయ్యావులకు 64,728 ఓట్లు రాగా, విశ్వేశ్వర్ రెడ్డికి 64,499 ఓట్లు వచ్చాయి. కేవలం 229 ఓట్లతో పయ్యావుల విజయం సాధించాడు.

2014 ఎన్నికల్లో విశ్వేశ్వర్ రెడ్డి వైసీపీ తరపున పోటీ చేశాడు. ఈ ఎన్నికలలో ఆయనకు 81,042 ఓట్లు రాగా, పయ్యావుల కేశవ్ కు 78,767 ఓట్లు వచ్చాయి. కేవలం 2,275 ఓట్లతో విశ్వేశ్వర్ రెడ్డి విజయం సాధించాడు. 2019 ఎన్నికలలో పయ్యావులకు 90,209 ఓట్లు రాగా, విశ్వేశ్వర్ రెడ్డికి 88,077 ఓట్లు వచ్చాయి. 2132 ఓట్ల స్వల్ప మెజారిటీతో పయ్యావుల విజయం సాధించాడు. అందుకే ఈసారి అధికారులు కౌంటింగ్ విషయంలో తేడా రాకుండా చర్యలు తీసుకుంటున్నారు.