18 దాటితే.. కేంద్రంలో బాబుదే చ‌క్రం!

పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారుకు 400 సీట్లు రావాల‌ని బీజేపీ పెద్ద‌లు ల‌క్ష్యం గా పెట్టుకున్నారు. దీనినే ప‌దే ప‌దే ప్ర‌చారం కూడా చేస్తున్నారు. ఎక్క‌డికి వెళ్లారు… అబ్ కీ బార్ చార్ సౌ పార్‌(ఈసారి 400 సీట్లు) అంటూ.. ప్ర‌చారం ఊద‌ర గొడుతున్నారు. కానీ, దేశంలో నెల‌కొన్న ప‌రిస్థితులు.. ప‌రిణామాల నేప‌థ్యంలో బీజేపీకి అన్ని సీట్లు రావ‌డం క‌ష్ట‌మ‌ని.. కీల‌క సెఫాల‌జిస్టులు అంచ‌నా వేస్తున్నారు. ఈ విష‌యాన్ని బీజేపీ కూడా గ్ర‌హించింది. అందుకే త‌మ‌తో క‌లిసి వ‌స్తామ‌న్న ప్ర‌తి ప్రాంతీయ పార్టీని భుజాల‌పై ఎక్కించుకుంది.

ప్ర‌స్తుతం యోగేంద్ర యాద‌వ్‌, బ్రెమ్మెర్ వంటి కీల‌క సెఫాల‌జిస్టులు చెబుతున్న అంచ‌నాల ప్ర‌కారం మోడీ కి వ్య‌క్తిగ‌తంగా అంటే బీజేపీకి.. 220-230 సీట్ల మ‌ధ్య‌లో వ‌చ్చే అవ‌కాశం ఉంటుంద‌ని చెబుతున్నారు. ఇంత‌కు మించే ఛాన్స్ లేద‌ని.. ఎంత‌లేద‌ని చెబుతున్నా.. ప్ర‌స్త‌త పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూట‌మి బాగానే పోరాడుతోంద‌ని.. దేశ‌వ్యాప్తంగా మైనారిటీ ఓటు బ్యాంకు ఇండియా కూట‌మి వైపే ఉంద‌ని చెబుతున్నారు.

అలానే.. ఎస్సీ, ఎస్టీల ఓటు బ్యాంకును చీల్చేందుకు మోడీ ప్ర‌య‌త్నించినా.. సాధ్యం కావ‌డం క‌ష్ట‌మే న‌ని.. ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఈ ప‌రిస్థితి స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని.. ఉత్త‌రాదిలోనూ.. రైతులు మోడీకి వ్య‌తిరేకంగా ఉన్నార‌ని.. దీంతో బీజేపీకి 220 సీట్లు వ‌స్తే..ఎక్కువ వ‌చ్చిన‌ట్టేన‌న్న‌ది వీరి అంచ‌నా. ఒక‌వేళ వీరి అంచ‌నాలే క‌నుక నిజ‌మైతే.. బీజేపీలో కూట‌మి పార్టీల‌కు రెక్క‌లు వ‌చ్చిన‌ట్టేన‌ని లెక్క‌లు వేస్తున్నారు. వీరిలోనూ ప్ర‌ధానంగ దక్షిణాదిలో టీడీపీ, జ‌న‌సేన కూట‌మి నుంచి 15-18 సీట్లుక‌నుక వ‌స్తే.. ఈ పార్టీల‌కు కేంద్రంలో ద‌న్ను పెరుగుతుంద‌ని చెబుతున్నారు.

ఎన్డీయే కూట‌మి పార్టీల్లో ఉన్న ప్రాంతీయ రాజ‌కీయ పార్టీలకు ఈ స్థాయిలో సీట్లు రావ‌ని.. అందుకే.. ఏపీ పైనే ఎక్కువ‌గా ఆధార‌ప‌డే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు. దీంతో టీడీపీ అధినేత చంద్ర‌బాబు మ‌రో సారి కేంద్రంలో చ‌క్రం తిప్పే స్థాయికి వ‌చ్చినా రావొచ్చ‌న్న‌ది సెఫాల‌జిస్టుల అంచ‌నాగా ఉంది. పూర్తిస్థా యిలో కాక‌పోయినా.. చంద్ర‌బాబు మాట‌కు అయితే.. కేంద్రంలో వాల్యూ పెరుగుతుంద‌ని అంటున్నారు.

బిహార్‌.. వంటి చోట్ల జేడీయూతో బీజేపీ క‌లిసినా. అక్క‌డ 7-8 సీట్లు మాత్ర‌మే జేడీయ‌కు వ‌స్తాయ‌ని అంటున్నారు. దీంతో ఏపీలో వ‌చ్చే సీట్ల‌పై బీజేపీ ఆధార‌ప‌డ‌డం ఖాయ‌మ‌నిలెక్క‌లు వేస్తున్నారు. ఫ‌లితంగా చంద్ర‌బాబు కేంద్రంలో కీల‌క రోల్ పోషించే అవ‌కాశం ఉండొచ్చన్న‌ది వీరి మాట‌. ఏం జ‌రుగుతుంద‌నేది జూన్ 4 వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.