మాచర్లలోని పాల్వాయి గేటు పోలింగ్ బూత్‌లో అక్కడి సిటింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సాగించిన విధ్వంసకాండకు ప్రజాస్వామ్యమే సిగ్గుతో తలవంచుకుంది. ఓ ఎమ్మెల్యే అయి ఉండి ఈవీఎంను, వీవీ ప్యాట్‌ను ధ్వంసం చేసిన తీరు అన్ని వర్గాల ప్రజలకూ ఆగ్రహాన్ని తెప్పించింది. ప్రజస్వామ్య దేశంలో ఇలాంటి వాటికి తావు ఉండకూడదని, పిన్నెల్లిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలూ ఈ ఘటనను తీవ్రంగా ఖండించాయి. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈ ఘటనపై సీరియస్ అయింది.
కానీ ఇంత జరుగుతున్నా జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం ఈ ఘటనపై సైలెంట్‌గా ఉండటం హాట్ టాపిక్‌గా మారింది. ఏపీలో ఏం జరిగినా స్పందించే పవన్.. ఓ వైసీపీ ఎమ్మెల్యే చేసిన అరాచకాలపై రియాక్టు కాకపోవడంలో ఆంతర్యమేంటో అర్థం కావడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పిన్నెల్లిని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించడం, ఆయన పారిపోవడం, ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించడం, జూన్ 6వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశించడం.. ఇలా పరిణామాలన్నీ చకచకా జరిగిపోతున్నాయి. కానీ పవన్ మాత్రం వీటిపై రియాక్ట్ కావడం లేదు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అరాచకాలను, అక్రమాలను ప్రశ్నిస్తూ ఆ పార్టీని ఓడించాలని ఓటర్లకు పిలుపునిచ్చిన పవన్ ఇప్పుడు ఎక్కడున్నారు అనే ప్రశ్న తలెత్తుతోంది. ప్రచారం తర్వాత ఆయన బయట కనిపించడం లేదు. అయితే ఎక్కుడున్నా సరే వైసీపీ ఎమ్మెల్యే చేసిన అరాచకంపై ఓ పార్టీ అధ్యక్షుడిగా ఆయన స్పందించాల్సిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఎలాగో వైసీపీ ఓడిపోతుంది కదా ఇప్పుడు ఎందుకు బురదపై రాయి విసరడం అని పవన్ కామ్‌గా ఉన్నారనే వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి నాయకుల పని పడదామనే ఆలోచనలో పవన్ ఉన్నట్లు తెలిసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates