పిన్నెల్లి అష్ట‌దిగ్భందం.. ఈ రోజు వ‌స్తుంద‌ని ఊహించ‌లేదా!

ఎంత ఎగిరితే.. అంతా కింద‌కే ప‌డాలి.. త‌ప్ప‌దు! ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్నారెడ్డి వ్య‌వ‌హారం కూడా అచ్చంగా అలానే ఉంది. నాకు తిరుగులేదు.. నేను చెప్పిందే వేదం.. అనుకున్న ఆయ‌న‌కు అష్ట‌దిగ్భంధం ఎదురైంది. కాలు క‌దిపితే.. కేసు పెట్ట‌మంటూ.. హైకోర్టు సంచ‌ల‌న ఆదేశాలు ఇచ్చింది. అంతేకాదు.. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం మాచ‌ర్ల‌లోకి అడుగు పెట్ట‌డానికి కూడా వీల్లేద‌ని తేల్చి చెప్పింది. ఎవ‌రితోనూ మాట్లాడడానికి కూడా కోర్టు ఒప్పుకోలేదు. ఎవ‌రి జోలికీ వెళ్ల‌డానికి కూడా వీల్లేద‌ని తేల్చి చెప్పింది. ఇక‌, ఇక్క‌డితో ఊరుకుంటే.. పెద్ద స‌మ‌స్య ఉండేది కాదు.

కానీ, ఇక్క‌డే హైకోర్టు చాలా ముందు చూపు ప్ర‌ద‌ర్శించింది. ఎక్క‌డ ఎవ‌రు ఎలాంటి అరాచ‌కం చేసినా..ఆ ప‌ర్వ‌సానం తాలూకు ఫ‌లితాన్ని కూడా.. పిన్నెల్లి ఖాతాలోనే వేయాల‌ని స్ప‌ష్టం చేసింది. ఇదీ.. అస‌లు సంగ‌తి!! కౌంటింగుకు రోజులు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో ఏమైనా చేద్దామ‌నే ఉత్సాహానికి హైకోర్టు ఇక్క‌డే ముంద‌ర కాళ్ల‌కు బంధం వేసిన‌ట్టు.. “ఏం జ‌రిగినా నీదే బాధ్య‌త‌” అని తేల్చి చెప్పింది. అంతేకాదు.. త‌న అనుచ‌రుల‌ను.. కార్య‌క‌ర్త‌ల‌ను.. కూడా క‌ట్ట‌డి చేసేబాధ్య‌త‌ను కూడా పిన్నెల్లిపైనే పెట్టి.. త‌ల‌పై చ‌ట్టం అనే క‌త్తిని వేలాడ‌దీసింది. రాష్ట్ర స్థాయిలో ఇదొక అనూహ్య‌మైన ప‌రిణామం.

ఇక‌, పిన్నెల్లి ఏం చేస్తున్నారు? ఎక్క‌డకు వెళ్తున్నారు? ఎవ‌రితో మాట్లాడుతున్నారు? అనే విష‌యాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిశీలించేందుకు డీఎస్పీ స్థాయి అధికారికి కూడా అధికారాలు ఇచ్చింది. ప‌రిశీలించాల‌ని తేల్చి చెప్పింది. ఏ చిన్న తేడా ప‌సిగ‌ట్టినా.. కోర్టుతో ప‌నిలేకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కూడా పోలీసుల‌కు తేల్చి చెప్పింది. మొత్తంగా చూస్తే.. అతి చేసిన ఫ‌లితం .. ఎమ్మెల్యే పిన్నెల్లికి బాగానే రుచి చూపించింద‌నే వాద‌న వినిపిస్తోంది. నిజానికి రెండు ద‌శాబ్దాలుగా.. మాచ‌ర్ల‌లో పిన్నెల్లి స‌ర్వంస‌హా చ‌క్ర‌వ‌ర్తి.. అన్న త‌ర‌హాలో వ్య‌వ‌హ‌రించారు. ఆయ‌న‌కు తిరుగులేద‌ని లెక్క‌లు వేసుకున్నారు.

నిజానికి ఈ 20 ఏళ్ల కాలంలో టీడీపీ కూడా అధికారంలో ఉంది. అయినా.. ఆయ‌న వ్యూహాల‌కు.. ఎక్క‌డా ఎదురు నిలిచిన వారు లేక పోవ‌డం గ‌మ‌నార్హం. పూర్తి ఎపిసోడ్‌లో తాజా ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తుంటే.. ఇక్క‌డ ఆయ‌న‌ను కాపాడిదంల్లా ఒక్కటే.. ఏ కోడ్ ను ఆయ‌న ఉల్లంఘించారో.. అదే కోడ్ ఇప్పుడు ఆయ‌న‌కు ర‌క్ష‌ణ‌గా మారింది. “ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా ఉన్న వ్య‌క్తి.. కావ‌డం, కౌంటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉండ‌డంతో ఆయ‌న‌ను జూన్ 6వ తేదీ వ‌ర‌కు చ‌ర్య‌ల నుంచి నిలువ‌రిస్తున్నాం” అని కోర్టు పేర్కొన‌డం గ‌మ‌నార్హం. అయితే.. తాను నిలువ‌రించిన స్థాయి నుంచి.. తానే నిరువ‌రించే స్థాయిదిగిపోవాల్సి వ‌స్తుంద‌ని పిన్నెల్లి ఊహించి కూడా ఉండ‌ర‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.