సడెన్ గా షర్మిల ఎంట్రీ

ఏపీ సీఎం జ‌గ‌న్‌ను ఉద్దేశించి ఆయ‌న సోద‌రి, ఏపీసీసీ చీఫ్ ష‌ర్మిల నిప్పులు చెరిగారు. “జ‌గ‌న్ గారూ.. సిగ్గుతో త‌ల‌దించుకుంటా రో.. సిగ్గులేకుండా మిన్న‌కుంటారో!” అని తీవ్ర వ్యాఖ్య‌ల‌తో విరుచుకుప‌డ్డారు. “ఇదేనా.. అక్క‌చెల్లెమ్మ‌ల‌పై ప్రేమ‌” అని నిల‌దీశారు.

ఈ మేర‌కు ఆమె సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌తో సూటి పోటి ప‌దాల‌తో సీఎం జ‌గ‌న్‌పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్ర‌స్తుతం ఎన్నికల అనంత‌రం.. విదేశాల‌కు వెళ్లిన ష‌ర్మిల‌.. అక్క‌డ నుంచే ఏపీలో జ‌రిగిన ఒక ప‌రిణామంపై తీవ్ర‌వ్యాఖ్య‌ల‌తో విరుచుకుప‌డ్డారు. ఈ క్ర‌మంలో జ‌గ‌న్‌ను తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు.

అస‌లేం జ‌రిగింది?

వారం రోజుల కిందట ఉమ్మ‌డి కృష్ణా జిల్లాలోని కైక‌లూరులో ప‌దో త‌రగ‌తి చ‌దువుతున్న విద్యార్థినిపై ఆమె స‌హ‌చ‌ర విద్యార్థు లు.. అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న స్థానికంగానే కాకుండా.. రాష్ట్రంలోనూ సంచ‌ల‌నం సృష్టించింది. కైకలూరు మండవల్లి హైస్కూల్‌లో పదో తరగతి చ‌దివిన విద్యార్థిని.. ఈ ప‌రీక్ష‌ల్లో పాసైంది.

అయితే.. ఉన్న‌త విద్య‌లో చేరేందుకు ఆమె.. త‌న‌ మార్కుల మెమో కోసం ఈ నెల 15న స్కూల్‌కు వచ్చింది. ఈ స‌మ‌యంలో పాఠ‌శాల‌లో ఎవ‌రూ లేక‌పోవ‌డంతో వెనుదిరిగింది. అయితే.. ఆమెను గ‌మ‌నించిన న‌లుగురు స‌హ‌చ‌ర విద్యార్థులు(వీరంతా ఒకే సెక్ష‌న్‌) ఆమెను పిలిచి.. ఓ రూంలోకి తీసుకువెళ్లారు.

అనంత‌రం బాలిక‌పై అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఇదే స‌మ‌యంలో దీనిని వీడియో కూడా తీశారు. అయితే.. వీడియో తీసిన బాలుడు మ‌రోసారి బాలిక‌ను బెదిరించి.. మ‌ళ్లీ పాఠ‌శాల వ‌ద్ద‌కు రావాల‌ని.. పిల‌వ‌డంతో బాలిక ఈ విష‌యాన్నిత‌ల్లికి చెప్పింది. దీనిపై పెద్ద పంచాయితీ కూడా సాగింది.

గ్రామంలో స‌ర్పంచ్ స‌హా పెద్ద‌లు దీనిపై పంచాయ‌తీ చేశారు. చివ‌ర‌కు ఇది పోలీసుల‌కు చేరింది. ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న‌పై నిందితుల‌ను అరెస్టు చేసిన‌ట్టు పోలీసులు తెలిపారు. అయితే.. ఇంత జ‌రిగినా.. ఈ ఘ‌ట‌న‌పై స‌ర్కారు ప‌రంగా ఎవ‌రూ స్పందించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ష‌ర్మిల ఫైరింగ్‌!

ఇదే విష‌యాన్ని కోట్ చేస్తూ.. ష‌ర్మిల ఏపీ స‌ర్కారుపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు.
నా అక్కలు, నా చెల్లెమ్మలు, నా తల్లులు నా అవ్వలు అంటూ జబ్బలు చరిచి, మైకుల ముందు గొంతు చించుకుని మొసలి కన్నీరు, ఫేక్ ప్రేమలు నటించే ముఖ్యమంత్రి గారు, మన రాష్ట్రంలో, మీ పాలనలో మహిళల భద్రతకు, బ్రతుకులకు పట్టిన పీడా, దేశమంతా చెప్పుకుంటోంది. లండన్ వీధుల్లో పొర్లుదండాల మధ్య విహరిస్తున్న మీకు, ఇక్కడి ఆర్తనాదాలు, హాహాకారాలు వినపడవు. రాష్ట్రానికి ఈ అత్యున్నత ర్యాంకులు ఎందులో రావాలో అందులో రావు. మీరు, మీ మహిళా మంత్రులు, నాయకురాళ్లు సిగ్గుతో తలవంచుకుంటారో, సిగ్గులేకుండా మిన్నకుండిపోతారో ప్రజలు గమనిస్తున్నారు. అని ష‌ర్మిల వ్యాఖ్యానించారు.