ర‌ఘురామ హోం మినిస్ట‌ర్‌! బాబు ఏమంటారో?

2019 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి న‌ర్సాపురం ఎంపీగా గెలిచి, ఆ త‌ర్వాత రెబెల్‌గా మారిన ర‌ఘురామ కృష్ణంరాజు జ‌గ‌న్‌ను విమర్శిస్తూనే ఉన్నారు. ఇప్పుడు టీడీపీలోకి చేరి ఉండి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయ‌న విజ‌యం ఖాయ‌మ‌నే అభిప్రాయాలున్నాయి. దీంతో కూట‌మి అధికారంలోకి రాగానే ర‌ఘురామ జ‌గ‌న్‌కు మ‌రింత డేంజ‌ర్‌గా మారే అవ‌కాశాలున్నాయి. ర‌ఘురామ హోం మినిస్ట‌ర్ అవుతారని లేదా స్పీక‌ర్ ప‌ద‌విని చేప‌డ‌తార‌నే చ‌ర్చ జోరుగా సాగుతోంది. ఈ రెండింట్లో ఏ ప‌ద‌వి చేప‌ట్టినా అది వైసీపీకి, జ‌గ‌న్‌కు ప్ర‌మాద‌క‌రంగా మారే ఆస్కార‌ముంద‌నే చెప్పాలి.

జ‌గ‌న్‌పై పీక‌ల్లోతు కోపంలో ఉన్న ర‌ఘురామ అవ‌కాశం కోసం ఎదురు చూస్తున్నార‌నే చెప్పాలి. వైసీపీ రెబ‌ల్‌గా ర‌ఘురామ మార‌డంతో వైసీపీ నాయ‌కులు, జ‌గ‌న్ ఆయ‌న‌పై ప్ర‌తీకారం కోసం ఎన్నో ప్ర‌య‌త్నాలు చేశారు. ఎంపీగా స‌స్పెన్ష‌న్ విధించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని లోక్‌స‌భ స్పీక‌ర్‌ను ఎన్నోసార్లు కోరారు. మ‌రోవైపు రాష్ట్రంలోనూ ఆయ‌న‌పై కేసులు న‌మోద‌య్యాయి. ఈ నేప‌థ్యంలో త‌న అవ‌కాశం కోసం ఇప్పుడు ర‌ఘురామ వెయిట్ చేస్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది.

ఈ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కూట‌మి విజ‌యం ఖాయ‌మ‌వడంతో ర‌ఘురామ త‌న వాయిస్‌ను మ‌రింత పెంచారు. మే 13న పోలింగ్ రోజున వైసీపీకి జ‌నాలు స‌మాధి క‌ట్టార‌ని జూన్ 4న ఫ‌లితాలు వెలువ‌డే రోజున పెద్ద క‌ర్మ అంటూ ర‌ఘురామ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ ప‌ని అయిపోయింద‌ని పేర్కొన్నారు. ఇక కూట‌మి అధికారంలోకి వ‌చ్చాక ర‌ఘురామ‌కే హోం మంత్రి ప‌ద‌వి ఇస్తార‌ని ఆయ‌న అభిమానులు, అనుచ‌రులు ముందే సంబరాల్లో మునిగిపోతున్నారు. మ‌రోవైపు స్పీక‌ర్ ప‌ద‌వి ఇస్తార‌నే ప్ర‌చారమూ ఊపందుకుంది. మ‌రి బాబు మ‌న‌సులో ఏముందో చూడాలి.