చెరపకురా.. చెడేవు! అన్నట్టుగా ఉంది.. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరిస్థితి. ఈ నెల 13న జరిగిన పోలింగ్ సమయంలో ఆయన, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి నియోజకవర్గంలో సృష్టించిన అలజడి.. వారితోనే కాకుండా.. కీలకమైన.. ఐఏఎస్ అధికారులకు కూడా.. చుట్టుకుంటోంది. ఇంత దారుణం జరిగిన తర్వాత.. ఈ విషయాన్ని దాచి పెట్టిన కలెక్టర్ లోతేటి శివశంకర్‌ను అధికారులు బదిలీ చేశారు. దీంతో అంతా అయిపోయిందని అనుకున్నారు.
కానీ, అసలు విషయం ఇప్పుడిప్పుడే బయటకు వస్తోంది. మాచర్లలోని పాలవాయి గేటు ఎన్నికల బూత్‌లో ఈవీఎంను, వీవీ ప్యాట్ ను ధ్వంసం చేసిన విషయం తెలిసి కూడా.. కీలకమైన అధికారి ఒకరు.. దాచి పెట్టారనే వాదన వినిపిస్తోంది.
ఇప్పుడు అందరి వేళ్లూ ఆయన వైపేచూపిస్తున్నాయి. ఆయన పూర్తిగా సహకరించారని.. అందుకే.. ఘటన జరిగిన తర్వాత.. వారం రోజుల వరకు కూడా.. ఈ విషయం వెలుగు చూడలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
దీంతో ఆయనపై నే చర్యలు కోరాలని.. ప్రతిపక్షాలు నిర్ణయించాయి. ఈయనతోపాటు.. మరో కీలక అధికారి.. రాష్ట్ర వ్యాప్తంగా యంత్రాంగంపై పట్టున్న అధికారి కూడా.. ఈ విషయాన్ని దాచి.. వైసీపీ ఎమ్మెల్యేను కాపాడే ప్రయత్నం చేశారనే విమర్శలు వచ్చాయి.
అదేవిధంగా మరో ఐపీఎస్ అధికారి ఏకంగా.. పోలీసుల ఆనుపానులను.. ప్రత్యేక దర్యాప్తు బృందాల పరిశీలనను ఎక్కడికి వస్తున్నారు? ఏం చేస్తున్నారు? ఎవరిని విచారిస్తున్నారు..? అనే విషయాలను కూడా పిన్నెల్లికి చేరవేశారని భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆ ముగ్గురు ఉన్నతాధికారుల మెడకు కూడా.. పిన్నెల్లి వ్యవహారం చుట్టుకుందనే వాదన వినిపిస్తోంది. ఇన్ని రోజులు ఏమయ్యారు? ఏంచేశారనే ప్రశ్నలు తెరమీదికి వచ్చాయి. సిట్ బృందాలు రంగంలోకి దిగేవరకు.. ఎందుకు ఈ ఘటనను దాచిపెట్టారనే కోణంలోనూ ప్రశ్నలు తెరమీదికి వచ్చాయి. దీంతో మరో రెండు మూడు రోజుల్లో అయినా.. వీరి పైనా చర్యలు ఉంటాయని అంటున్నారు. మరి ఏంజరుగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates