ఈవీఎం ధ్వంసం కేసులో ప్రధాన నిందితుడు, మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలివికి పోలీసులే షాకయ్యారు. అవును.. తెలివి ఉపయోగించి పోలీసుల కళ్లు గప్పి ఆయన తప్పించుకుని పారిపోయారని చెప్పాలి.
పోలింగ్ తేదీన మాచర్లలో గొడవల కారణంగా పిన్నెల్లితో పాటు ఆయన సోదరుడిని పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు. కానీ వీళ్లు అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లిపోయారు. ఇప్పుడేమో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో పోలీసులు రంగంలోకి దిగారు. పిన్నెల్లి అరెస్టు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ ఆయన దొరకడం లేదు.
హైదరాబాద్‌లోని నివాసంలో పిన్నెల్లిని అరెస్టు చేసేందుకు ఏపీ పోలీసులు వెళ్లారు. కానీ ఆయన అక్కడ లేరు. ఆయన ఫోన్ సిగ్నల్స్‌ను ట్రేస్ చేస్తూ పోలీసులు కారును వెంబడించారు. తీరా కారు దగ్గరికి చేరుకుని చూస్తే పిన్నెల్లి గన్‌మెన్, డ్రైవర్ మాత్రమే అందులో ఉన్నారు.
మరి సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని పరీక్షించగా కారులో ఫోన్ దొరికిందని తెలిసింది. కారులో ఫోన్ పంపించి పిన్నెల్లి పోలీసులను బోల్తా కొట్టించారు. ఆయన మరో మార్గంలో హైదరాబాద్ నుంచి తప్పించుకున్నారని సమాచారం.
పిన్నెల్లి విదేశాలకు పారిపోకుండా ఉండేలా పోలీసులు లూకౌట్ నోటీసులు జారీచేశారు. అన్ని విమానాశ్రయాలను అలర్ట్ చేశారు. ఈ నేపథ్యంలో పిన్నెల్లి దేశంలోని ఇతర రాష్ట్రాలకు పారిపోయినట్లు తెలుస్తోంది.
తమిళనాడుకు వెళ్లారని లేదు కేరళకు వెళ్లారనే విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం ఈ మ్యాటర్‌ను సీరియస్‌గా తీసుకోవడంతో పోలీసులపై ఒత్తిడి పెరిగిపోతోంది. వెంటనే పిన్నెల్లిని అరెస్టు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయిన పిన్నెల్లి కొన్ని రోజుల గ్యాప్ తర్వాత వచ్చి లొంగిపోతానని అనుచరులతో చెప్పినట్లు తెలిసింది.