విశాఖ చుట్టూ పొలిటిక‌ల్ హీట్‌!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజకీయం అంటే విజ‌య‌వాడ పేరే ప్ర‌ధానంగా వినిపించేదే. ఆ త‌ర్వాత రాయ‌ల‌సీమ రేసులోకి వ‌చ్చింది. కానీ ఇప్పుడు ఏపీలో విశాఖ‌ప‌ట్నం చుట్టూనే పొలిటిక‌ల్ హీట్ నెలకొంద‌నే చెప్పాలి.

ఏపీలో అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఇప్పుడు అంద‌రి నేత‌ల క‌ళ్లు విశాఖ‌పైనే ప‌డ్డాయి. ఇప్ప‌టికే విశాఖ‌ను ప‌రిపాల‌న రాజ‌ధాని అని పేర్కొంటూ ఇక్క‌డే వైసీపీ మ‌కాం వేస్తోంది.

జ‌గ‌న్ మ‌ళ్లీ అధికారంలో వ‌స్తే విశాఖ నుంచే పాల‌న కొన‌సాగిస్తార‌ని వైసీపీ చెబుతోంది. ఇందుకు అనుకూలంగా రుషికొండ‌పై భ‌వ‌నాలు కూడా సిద్ధ‌మ‌వుతున్నాయి. మ‌రోవైపు టీడీపీ కూడా విశాఖ‌పై ఫోక‌స్ పెట్టిన‌ట్లే క‌నిపిస్తోంది.

ఇటీవ‌ల టీడీపీ నాయ‌కులు త‌రచుగా విశాఖ‌ప‌ట్నానికి వెళ్లివ‌స్తున్నారు. విజ‌య‌వాడ‌, నెల్లూరు త‌దిత‌ర జిల్లాల‌కు చెందిన టీడీపీ నాయ‌కులు ఇప్పుడు విశాఖ‌పై మ‌న‌సు ప‌డుతున్నారు.

పోలింగ్ ముగిశాక విజ‌య‌వాడ‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా మ‌హేశ్వ‌ర‌రావు విశాఖ వ‌చ్చి ప్రెస్ మీట్ పెట్టి వెళ్లారు. అధికారంలోకి వచ్చేది టీడీపీనేన‌ని స్ప‌ష్టం చేశారు.

నెల్లూరు జిల్లా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి, ఎంపీ ర‌ఘురామ కృష్ణంరాజు కూడా విశాఖ వ‌చ్చి మీడియాతో మాట్లాడారు. ఇదే వ‌రుస‌లో మ‌రికొంత‌మంది టీడీపీ నాయ‌కులు విశాఖ‌కు వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

విశాఖ‌లో వైసీపీ ఆధిప‌త్యానికి గండికొట్టేందుకే టీడీపీ ఈ వ్యూహాన్ని అమలు చేస్తోంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇప్పుడు టీడీపీ నేత‌లు విశాఖ‌కు వెళ్తున్నా కూట‌మి అధికారంలోకి వ‌చ్చాక అంద‌రూ అమ‌రావ‌తిలోనే ఉండిపోతార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.