ఏదైనా ఘటన జరిగితే.. క్షణాల్లోనే బాహ్య ప్రపంచానికి తెలిసిపోతోంది. అంతే వేగంగా సోషల్ మీడియాలో నూ ప్రచారం అవుతోంది. ఎక్కడో ఇరాన్‌లో అక్కడి అధ్యక్షుడు ప్రమాదంలో చనిపోతే.. కొన్ని గంటల వ్యవధిలోనే.. ప్రపంచాన్ని ఈ వార్త చుట్టేసింది.
మరి అలాంటిది.. పక్కనే ఉన్న మాచర్ల నియోజకవర్గంలో చోటు చేసుకున్న ఈవీఎం, వీవీ ప్యాట్‌ల విధ్వంసం.. ఘటనలు మాత్రం బాహ్య ప్రపంచానికి వారం రోజుల ఆలస్యంగా తెలిసింది. ఆయా ఘటనలకు సంబంధించిన వీడియోలు 8 రోజుల తర్వాత.. బయటకు వచ్చాయి.
నిజానికి మాచర్లలో ఈ నెల 13న పోలింగ్ జరిగిన సమయంలోనే అరాచకాలు జరుగుతున్నాయని వార్తలు వచ్చాయి. ఆ సమయంలోనే ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్నారెడ్డి పలు బూతుల్లో విధ్వంసం సృష్టించారని కూడా వార్తలు వచ్చాయి.
కానీ, ఆయన ఏం చేశారు? ఏం జరిగింది? అనేది మాత్రం 8 రోజుల తర్వాత.. ఈ నెల 20న కానీ, బయటకు రాలేదు. మరి ఆ 13 నుంచి 20వ తారీకు మధ్య ఏం జరిగింది? అరాచకం సృష్టించిన పిన్నెల్లి సోదరులు.. రాష్ట్రం విడిచి పారిపోయే వరకు ఎందుకు వీటిని బయటకు తీసుకురాలేదన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.
పైగా.. నియోజకవర్గంలో జరుగుతున్న వివాదాలపై టీడీపీ జోక్యం చేసుకుని ఆరోపించే వరకు కూడా.. పోలీసులు పట్టించుకోలేదు. కలెక్టర్ కన్ను కూడా సారించలేదు.
ఇక, ప్రత్యేక దర్యాప్తు బృందాలు అడుగు పెట్టేవరకు కూడా.. సీసీ టీవీ ఫుటేజ్‌లు కూడా బయటకు రాలేదు. ఈ పరిణామాలను గమనిస్తే.. 13వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మధ్యలో ఏదో జరిగిందనే వాదనకు బలం చేకూరుతోంది. పిన్నెల్లి సోదరులు.. 13వ తేదీనే.. కొందరు ప్రభుత్వ పెద్దలను కలవడంపై వార్తలు వచ్చాయి.
ఆ తర్వాత.. ఏదో జరిగిందనే వాదన బయటకు రావడం.. వారు రాష్ట్రాన్ని వీడి వెళ్లిపోయే వరకు కూడా ఈ ఫుటేజీలు బయటకు రాకపోవడం గమనార్హం. మొత్తంగా దీని వెనుక ఏదో కుట్ర జరిగిందనేది ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణ. మరి ఏం జరిగింది? ఎవరు ఉన్నారు? అనే కోణంలో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు పరిశీలకులు. ఇక ముందు ఇలాంటి వి జరగకుండా చర్యలు తీసుకునేందుకు ఇవి దోహద పడతాయని కూడా చెబుతున్నారు.