ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైసీపీ, కూటమి మధ్య హోరాహోరీ పోరు నడిచింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులపై సీఎం జగన్‌తో సహా వైసీపీ నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. ఎంతమంది జతకట్టినా వైసీపీ గెలుపును ఆపలేరని అన్నారు. కానీ ఇప్పుడు అంతా తలకిందులైందనే చెప్పాలి. జూన్ 4న వెలువడే ఫలితాల్లో కూటమి గెలవాలని వైసీపీ అభ్యర్థులు కోరుకుంటున్నారని సమాచారం. అందుకు ఓ కారణం ఉంది.
ఎన్నికల్లో ఉన్నదంతా పెట్టి వైసీపీ అభ్యర్థులు పోటీ చేశారు. జగన్ అభయంతో గెలుస్తామనే ధీమా వ్యక్తం చేశారు. కానీ పోలింగ్ సరళిని విశ్లేషించుకుంటున్న ఆయా అభ్యర్థులు ముందే ఓటమిపై అంచనాకు వస్తున్నారు. ఈ ఎన్నికల్లో విజయం దక్కదనే నిజాన్ని అర్థం చేసుకుంటున్నారని తెలిసింది. దీంతో ఎన్నికల్లో పెట్టిన డబ్బుల్లో కాస్తయినా వెనక్కి తెచ్చుకునేందుకు ఆయా అభ్యర్థులు ఫలితాలపై బెట్టింగ్ వేస్తున్నారని సమాచారం. తాము ఎలాగో ఓడిపోతామని తెలిసి కూటమి అభ్యర్థులు విజయాలు సాధిస్తారని ఈ వైసీపీ నేతలు బెట్టింగ్ వేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
గతంలో కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని జగన్ ప్రకటించినా వైసీపీ నేతలకు ఇప్పుడు సీన్ అర్థమైపోయిందనే టాక్ ఉంది. రోజులు గడిచే కొద్దీ వైసీపీ తరపున పోటీ చేసిన నాయకుల్లో మార్పు కనిపిస్తోందని చెబుతున్నారు. ఓ వైపు బెట్టింగ్ రాయుళ్లు కూటమిదే అధికారమని లక్షల్లో పందేలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది వైసీపీ అభ్యర్థులు కూడా కూటమిదే గెలుపంటూ బెట్టింగ్ కాస్తున్నారు. ఓ వైసీపీ అభ్యర్థి ఏకంగా రూ.50 కోట్ల వరకూ పందెం కాసినట్లు ప్రచారం జరుగుతోంది. ఎలాగో తాము ఓడిపోతాం కాబట్టి కూటమి గెలుపుతోనైనా పందెంలో కాసిన డబ్బులు వస్తాయనే ఆశతో వైసీపీ అభ్యర్థులు ఉన్నట్లు తెలిసింది.